గురుకుల విద్యార్థిని అనుమానాస్పద మృతి
గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న గడిగంపల్లికి చెందిన విద్యార్థిని బి .లావణ్య అనారోగ్యంతో మరణించింది.
దిశ, మహమ్మదాబాద్: మండల పరిధిలోని నంచర్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న గడిగంపల్లికి చెందిన విద్యార్థిని బి .లావణ్య అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న వెంటనే బహుజన్ సమాజ్ పార్టీ పరిగి నియోజకవర్గం అధ్యక్షులు మంచన్పల్లి ఆనంద్, మహమ్మదాబాద్ మండల అధ్యక్షులు నల్లోల రాములు గురుకుల పాఠశాలకు వెళ్లి సందర్శించి పాఠశాల సిబ్బందితో మాట్లాడారు.
విద్యార్థినికి 4 రోజుల నుండి జ్వరం, దగ్గు వచ్చిందని ఈ సందర్భంగా సిబ్బంది తెలిపారు. రెండవ శనివారం వారి కుటుంబ సభ్యులు వచ్చి అమ్మాయితో మాట్లాడుతుండగా అమ్మాయి పైకి లేవడానికి ఇబ్బంది పడినట్లు చెప్పిందని తెలిపారు. అప్పుడే ప్రిన్సిపాల్ వెంకటమ్మ, హెల్త్ డిపార్ట్ మెంట్ స్వరాజ్యంకు తెలియజేయడంతో జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. విద్యార్థి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్‌కు అక్కడి వైద్యులు రిఫర్ చేశారు.
కాగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ విద్యార్థిని మరణించింది. ఇదే విషయంపై శనివారం గ్రామ మాజీ సర్పంచ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె ఎం.నారాయణ, డి. వెంకట్, వీరాజీ గురుకుల పాఠశాలకు వెళ్లి జరిగిన ఘటనపై ఆరా తీశారు. విద్యార్థినికి నరాలకు సంబంధించిన వ్యాధి వలన మరణించిందని డాక్టర్లు చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత అసలు విషయం తేలనుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.