కాంగ్రెస్ అభ్యర్థులకు సర్వే ఫీవర్.. ప్రతీ రోజు AICCకి రిపోర్టుతో హై టెన్షన్!
అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధానాన్నే కాంగ్రెస్ ఇప్పుడు లోక్‌సభ ఎలక్షన్స్ లోనూ అవలంబిస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధానాన్నే కాంగ్రెస్ ఇప్పుడు లోక్‌సభ ఎలక్షన్స్‌లోనూ అవలంబిస్తున్నది. సునీల్ కనుగోలు టీమ్ మొదటి నుంచీ క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ ఇటు పీసీసీ పెద్దలకు, అటు ఏఐసీసీ నేతలకూ రిపోర్టులు ఇస్తున్నది. మిషన్-15 పేరుతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ టాస్క్ అప్పజెప్పడంతో 15 చోట్ల గెలవడం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇందుకోసం సునీల్ కనుగోలు టీమ్‌తో పాటు మరో రెండు ప్రైవేటు సర్వే సంస్థలను ఏఐసీసీ హైర్ చేసుకున్నది. అన్ని నియోజకవర్గాల్లో ఈ మూడు టీమ్‌ల సభ్యులు వేర్వేరుగా స్టడీ చేస్తూ పార్టీ లేటెస్ట్ స్టేటస్‌పై నేరుగా ఏఐసీసీకే డైలీ రిపోర్టులను పంపనున్నారు. అందులోని స్ట్రెంత్, వీక్‌నెస్‌కు అనుగుణంగా ప్రతీ నియోజకవర్గంలో ఉన్న ఏఐసీసీ అబ్జర్వర్లకు ఢిల్లీ నుంచే గైడెన్స్ అందనున్నది.
ఫీల్డులో ఒక పార్టీగా కాంగ్రెస్‌కు ఉన్న బలం, బలహీనతలతో పాటు అభ్యర్థుల విషయంలో ప్రజల ఫీడ్‌బ్యాక్‌ను ఈ సర్వే బృందాలు సేకరించనున్నాయి. ఏ విషయంలో ప్రజలు అనుకూలంగా ఉన్నారు... ఏ అంశంలో వ్యతిరేకంగా ఉన్నారు... దాన్నుండి బైటపడడానికి అనుసరించాల్సిన విధానాలు... ప్రచారాన్ని ఏ కోణంలో దూకుడుగా చేయాల్సి ఉంటుంది... స్థానికంగా ఉన్న సమస్యలపై ప్రజల అభిప్రాయమేంటి... వాటిని ప్రస్తావించి భరోసా కల్పించడం ద్వారా గ్రాఫ్ ఏ మేరకు పెంచుకోగలం... ప్రత్యర్థి పార్టీ, అభ్యర్థితో పోలిస్తే కాంగ్రెస్ క్యాండిడేట్ల స్థానం ఎక్కడ... మెరుగుపర్చుకోడానికి మార్చుకోవాల్సిన వ్యూహమేంటి... ఇలాంటి పలు అంశాలపై ఏఐసీసీ ఈ నివేదికలకు అనుగుణంగా గైడెన్సు ఇవ్వనున్నది. అబ్జర్వర్ల ద్వారా ఎంపీ సెగ్మెంట్ ఇన్‌చార్జిలకు మార్గదర్శకాలు జారీ కానున్నాయి.
నామినేషన్ల పర్వం దాదాపుగా ముగియడంతో ఇప్పుడు ప్రచారంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుందని పార్టీ ప్లాన్ చేసింది. ఆరు గ్యారంటీల అమలుతో పాటు వంద రోజుల పాలనలో ప్రజలకు అందించిన ఫలాలు, రానున్న రోజుల్లో వారికి అందుబాటులోకి తేనున్న స్కీమ్‌లు తదితరాలపై భరోసా కల్పించడంపైనే దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ విజయానికి కలిసొచ్చినట్లుగా ఇప్పుడు బీజేపీని వీలైనంతగా ఎక్స్‌పోజ్ చేయడం ద్వారా దాన్ని కార్నర్ చేయవచ్చన్నది ఏఐసీసీ భావన. పదేండ్ల మోడీ పాలనలోని వైఫల్యాలను ప్రజలకు విస్తృతంగా వివరించే యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. బీఆర్ఎస్ వీక్ కావడంతో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారడంతో మోడీ వైఫల్యాలనే బహిర్గతం చేయాలనుకుంటున్నది.
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు బాద్యతలను ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి అప్పజెప్పడంతో పాటు ఆ నియోజకవర్గాలకు మంత్రులనే ఇన్‌చార్జిలుగా నియమించారు. నామినేషన్లు స్టార్ట్ కావడానికి ముందు నుంచే మంత్రులు ప్రచార క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేసి బూత్ స్థాయి కమిటీలకు ఎమ్మెల్యేలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ మెకానిజంతో పాటు ఏఐసీసీ సైతం ఒక్క అవకాశాన్నీ చేజార్చుకోకుండా అబ్జర్వర్లను నియమించింది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే విజయాన్ని చేజిక్కించుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నది. ఈ అబ్జర్వర్లు ఎంపీ సెగ్మెంట్‌కు ఇన్‌చార్జిలతో సమన్వయం చేసుకుంటూ ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలను ఆచరణలో పెట్టేందుకు చొరవ తీసుకుంటారు.
ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఎక్కడ పార్టీకి బలహీనతలు ఉన్నాయి... ప్రజల నుంచి ప్రతికూలత ఉన్నది... దాన్ని అధిగమించడానికి ఏం చేయాలి... ప్రచారం క్యాంపెయిన్‌లో స్ట్రాటెజీని ఎలా మార్చాలి... ఏయే అంశాలను హైలైట్ చేయడం ద్వారా ప్రజలు ఆదరిస్తారు... ఇలాంటి అంశాలపై ఫీల్డులో తిరుగుతున్న మూడు సర్వే బృందాలు ఇచ్చే రిపోర్టుకు అనుగుణంగా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతీ రోజు పార్టీ, అభ్యర్థి గ్రాఫ్‌లో వచ్చే తేడాలను ఈ బృందాలు పసిగట్టి ఏరోజుకారోజు డిల్లీకి రిపోర్టు పంపుతాయి. తెలంగాణ మీద బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టిన దృష్ట్యా కాంగ్రెస్ కూడా అదనపు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నది. బీఆర్ఎస్ బాగా బలహీనపడడంతో ఆ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోవడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది.