కమాండ్ కంట్రోల్ రూం వర్క్ స్టార్ట్.. Social Media పై నిఘా నేత్రం
హైదరాబాద్ నగరంలో గత మూడు రోజులుగా నెలకొన్న పరిస్థితులను సీరియస్‌గా తీసుకున్న పోలీసు విభాగం సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరంలో గత మూడు రోజులుగా నెలకొన్న పరిస్థితులను సీరియస్‌గా తీసుకున్న పోలీసు విభాగం సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్‌లలో ప్రజల మధ్య విద్వేషాలను, రెచ్చగొటే వ్యాఖ్యలను, వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్నది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, మతసామరస్యానికి భంగం కలిగించేవాటి పట్ల కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నది. ఇందుకోసం నిరంతరం సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది. దీనికి తోడు పాతబస్తీలో ఘర్షణలకు కారణమవుతున్న పోస్టింగ్‌లను ఫిల్టర్ చేస్తున్నది. నగరంలోని సీసీ టీవీ ఫుటేజీని కూడా విశ్లేషిస్తున్నది. కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టింది. ఇటీవల ప్రారంభమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేలా ప్రత్యేక మెకానిజాన్ని రూపొందించింది.
సమాజంలో అశాంతి సృష్టిస్తున్న శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. తాజాగా ప్రగతి భవన్‌లో సమీక్షను కూడా నిర్వహించారు. మూడు రోజులుగా నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దుకాణాలను సాయంత్రానికే మూసివేయాల్సి వచ్చింది. ఇందుకు దారితీసిన కారణాల నేపథ్యంలో మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొనేలా పోలీసు విభాగం ఆలోచన చేస్తున్నది. తాజాగా పాతబస్తీలో అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో పోలీసులతోపాటు టాబ్‌లలో ఫొటోలు తీయడం, వాటి ఆధారంగా ఆ వ్యక్తుల వివరాలను సేకరించే ప్రక్రియ కూడా మొదలైంది. ఎలాగూ ట్రాఫిక్ పోలీసు విభాగం దగ్గర ఉన్న డ్రైవింగ్ లైసెన్సు, వాహనాల రిజిస్ట్రేషన్ వివరాల్లో ఉన్న ఫొటోలతో వీటిని టాలీ చేసే పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
రాష్ట్రానికి సమకూరుతున్న సొంత ఆదాయంలో దాదాపు 60 శాతానికి పైగా హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల జిల్లాల నుంచే ఉన్నందున శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఆ ప్రభావం పెట్టుబడులు, రెవెన్యూపై పడుతుందన్నది ప్రభుత్వ ఆందోళన. కొత్తగా పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ప్రశాంత వాతావరణం లేకపోతే సత్ఫలితాలు ఇవ్వవనేది అధికారుల భావన. ఎనిమిదేళ్ళుగా ప్రశాంతంగా ఉన్న నగరంలో ఇప్పుడు శాంతిభద్రతలు క్షీణిస్తే అది ఒకవైపు ప్రభుత్వానికి, పరిపాలనకు చెడ్డపేరు తేవడం మాత్రమే కాక కొత్త పరిశ్రమలు రావడానికి ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించారు.
మత ఘర్షణలు జరిగితే రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం దెబ్బతినడం మాత్రమే కాక రాజకీయ అనిశ్చితి కూడా తలెత్తే ప్రమాదం ఉన్నదనేది సర్కారు భావన. గతేడాది చివరి నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో తలెత్తిన మార్పులు ఇటీవలి కాలంలో మరింత వేడెక్కాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఉప్పు-నిప్పులా మారాయి. మాటలయుద్ధంతో పాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మతపరమైన ఘర్షణలకు కారణమవుతున్నాయి. ఇవన్నీ రానున్న కాలంలో విపరీత పరిణామాలకు దారితీస్తాయన్న ఉద్దేశంతో పోలీసు శాఖ మరింత కఠినంగా వ్యవహరించక తప్పదనే ఆదేశాలను ప్రభుత్వ పెద్దలు నొక్కిచెప్పారు. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీతో పాటు ట్రాఫిక్ కూడళ్ళు, ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో టాబ్‌లు, మొబైల్ ఫోన్ల ద్వారా సేకరించి రికార్డుల్లో ఉన్న వివరాలతో పోల్చి గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖకు ఉన్న ప్రత్యేక గుర్తింపుకు అనుగుణంగా ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను వినియోగంలోకి తేవడం ద్వారా వివిధ రకాల నేరాలను భవనం నుంచే నియంత్రించే, నివారించే వెసులుబాటు కలిగింది. దేశంలోనే అత్యధిక కెమెరాలు ఉన్న నగరంగా హైదరాబాద్‌కు ఇప్పటికే గుర్తింపు ఉన్నది. వివిధ కాలనీ అసోసియేషన్లతో సంప్రదింపులు జరిపిన పోలీసులు కమ్యూనిటీ సీసీటీవీలను కూడా నెలకొల్పి పోలీసు మానిటరింగ్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ఇవన్నీ నేరాలను నివారించడంతో పాటు దర్యాప్తులో కీలకంగా ఉపయోగించుకోడానికి పోలీసులకు ప్రధాన అస్త్రంగా మారాయి. వ్యక్తుల ఫొటోలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విశ్లేషించి వారిని గుర్తించి చర్యలు తీసుకోడానికి పోలీసులు వినూత్నంగా చర్యలు మొదలుపెట్టారు.
రాజాసింగ్ అరెస్టు తర్వాత పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో తలెత్తిన ఘర్షణలను ప్రజలకు తెలియకుండానే పోలీసులు దూరం నుంచి టాబ్‌లలో చిత్రీకరించినట్లు ఆ శాఖ వర్గాలు సూచనప్రాయంగా పేర్కొన్నాయి. ఇలా నిక్షిప్తమైన ఫొటోలను రికార్డుల్లోని వివరాలతో సరిపోల్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే వారి ఇంటి అడ్రస్, మొబైల్ నెంబర్, వాడుతున్న వాహనాలు తదితరాలన్నింటినీ తెలుసుకుంటున్నట్లు సమాచారం. గతంలో వారిపైన నమోదైన నేరాలను ఆయా పోలీసు స్టేషన్లలోని డాటాబేస్ ఆధారంగా నిమిషాల వ్యవధిలోనే తెలుసుకుని గంటల వ్యవధిలోనే వారి కదలికలను పసిగట్టి అదుపులోకి తీసుకోడానికి వీలవుతుందని పోలీసు వర్గాల సమాచారం.
అందుబాటులోకి వచ్చిన అధునాతన సమాచార వ్యవస్థను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని పోలీసు వ్యవస్థ మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడడంతో పాటు రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలకు, పెట్టుబడులకు ఇబ్బంది లేకుండా పోలీసు శాఖ ద్వారా శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం రాజీ లేకుండా వ్యవహరించాలనుకుంటున్నది.