పార్టీకి సంబంధం లేకుండా.. తెలంగాణలో సునిల్ బన్సల్ సీక్రెట్ ఆపరేషన్!
రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్‌కు చెక్ పెట్టడంపై బీజేపీ అన్ని రకాల అస్త్రాలను వినియోగించుకోవాలని భావిస్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్‌కు చెక్ పెట్టడంపై బీజేపీ అన్ని రకాల అస్త్రాలను వినియోగించుకోవాలని భావిస్తోంది. కమలం పార్టీ నేతలను అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి సమన్వయంతో ముందుకు వెళ్లేలా ప్లాన్ రూపొందించుకోనుంది. అందుకే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్ సీక్రెట్ ఆపరేషన్‌ను మొదలుపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. స్తబ్దుగా ఉన్న పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆయన మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ అవ్వడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేకుండా స్తబ్దుగా ఉన్న నేతల జాబితాను సిద్ధం చేసుకుని బన్సల్ ఈ విషయంలోనే తలమునకలై ఉన్నట్లుగా సమాచారం. ఆ లిస్ట్‌లో ఇంకెవరి పేర్లున్నాయనేది తెలియడం లేదు.
పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సర్వశక్తులూ ఒడ్డుతున్నాడు. అయితే ఆయన ఒక్కరికి తోడుగా సీనియర్లు, ఇతర నేతలు కూడా కలిస్తే కాషాయ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని జాతీయ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే నేతలను ఒక్క చోటుకి చేర్చడంపై బన్సల్ కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. తెలంగాణలో కాషాయ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక్కో వ్యూహాన్ని అమలుచేస్తోంది. తన అమ్ములపొదిలో నుంచి ఒక్కో అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇప్పటికే ప్రజా గోస-బీజేపీ భరోసా పేరిట బైక్ ర్యాలీలు చేపట్టింది.
పార్లమెంటరీ ప్రవాస్ యోజన పేరిట కేంద్ర మంత్రుల పర్యటనలు నిత్యం కొనసాగుతున్నాయి. ఆపై ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే అంశంపై నేతలకు శిక్షణ తరగతులు నిర్వహించింది. క్రమంగా దూకుడును పెంచేసింది. తాజాగా వీధి సభలతో ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీ ప్రయత్నాలను ముమ్మరంగా పెంచేసింది. నిర్దేశించుకున్న 11 వేల సభలను సకాలంలో పూర్తిచేసి రికార్డు సృష్టించబోతోంది. ఇదిలా ఉండగా వీధి సభలపై జాతీయ నాయకత్వంతో పాటు రాష్ట్ర బీజేపీ ఇన్ చార్జి బన్సల్ సైతం ఇప్పటికే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. కాగా ఇవి కొనసాగతున్న తరుణంలోనే సీక్రెట్ గా స్తబ్దుగా ఉన్న నేతలను ఆయన కలుస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు.
తెలంగాణలో కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే నేతలంతా ఒక్క తాటిపైకి రావాలని బన్సల్ భావిస్తున్నారు. అందుకే నేతలంరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. పార్టీకోసం శ్రమించి గుర్తుంపు దక్కడంలేదని స్తబ్దుగా ఉన్న నేతలకు ప్రియారిటీ ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. వారి సేవలను పార్టీకి తిరిగి వినియోగించుకోవాలని చూస్తున్నారు. పార్టీ కోసం శ్రమించిన వారి సేవలను మరింత ఎక్కువగా వినియోగించుకోవడంలో భాగంగానే ఆయన పలువురిని కలవాలని డిసైడ్ అయినట్లుగా వినికిడి.
అందులో భాగంగానే ఇటీవల మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసినట్లు సమాచారం. వీధి సభల ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణకు వచ్చిన బన్సల్ ఇంకెవరిని కలుస్తారనేది అంతుచిక్కడం లేదు. ఆయన సిద్ధం చేసుకున్న జాబితాలో ఇంకెవరి పేర్లున్నాయి. ఇంకెంతమందిని ఆయన కలవబోతున్నారు, కేసీఆర్ ను ఎలా ఢీకొట్టబోతున్నారనేది రాజకీయంగా సంచలనంగా మారనుంది. వ్యూహాలు రచించడంలో సిద్ధహస్తుడిగా పేరున్న బన్సల్ తాజా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి: మెడికో ప్రీతిది ముమ్మాటికీ హత్యే: రాష్ట్ర సర్కార్‌పై బండి సంజయ్ ఫైర్