తెలంగాణ సీఈఓగా సుదర్శన్ రెడ్డి చార్జ్

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఇంతకాలం పనిచేసిన వికాస్‌రాజ్ ఆ బాధ్యతల నుంచి శుక్రవారం తప్పుకున్నారు.

Update: 2024-07-12 09:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఇంతకాలం పనిచేసిన వికాస్‌రాజ్ ఆ బాధ్యతల నుంచి శుక్రవారం తప్పుకున్నారు. ఆ స్థానంలో సుదర్శన్‌రెడ్డి నియమితులయ్యారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో సర్వీసెస్, హ్యూమన్ రిసోర్స్ సర్వీసెస్ సెక్రెటరీగా పనిచేస్తున్నారు. దీనికి ముందు హైదరాబాద్ మెట్రో వాటర్ సర్వీసు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. గతంలో రాష్ట్ర సర్వీసులో ఉన్న వికాస్‌రాజ్ 2022 మార్చిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు చేపట్టారు.

ఆయన హయాంలోనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఉప ఎన్నిక, రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. దాదాపు రెండేండ్లకు పైగా సీఈఓగా పనిచేసిన వికాస్‌రాజ్ ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకుని రాష్ట్ర సర్వీసులోకి రావడంతో ఆయనకు ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సీసీఎల్ఏగా నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనిపై ఉత్తర్వులు ద్వారా స్పష్టత ఇవ్వనున్నారు. సీఈఓ బాధ్యతల నుంచి రిలీవ్ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఫస్ట్ వీక్‌లోనే సమ్మతి తెలియజేసింది. తదుపరి సీఈఓగా సుదర్శన్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఇప్పుడు లాంఛనంగా బాధ్యతలు తీసుకున్నారు.


Similar News