పేపర్ లీకేజీతో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాల్లో మట్టి కొట్టింది: మర్రి శశిధర్ రెడ్డి
పేపర్ లీకేజీతో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాల్లో మట్టి కొట్టిందని మాజీ మంత్రి బీజీపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ, సికింద్రాబాద్: లీకేజీతో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాల్లో మట్టి కొట్టిందని మాజీ మంత్రి బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఏబీవీపీ అధ్వర్యంలో బుధవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల అవరణలో దీక్ష చేపట్టగా.. ఈ దీక్షకు మర్రి శశిధర్ రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యగా సిట్ పేరుతో కాలయాపన చేస్తుందన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడితే సహించేది లేదన్నారు. అనంతరం పలువురు విద్యార్దులు మాట్లాడుతూ.. ఐదు రూపాయల అన్నపూర్ణ భోజనంతో కడుపు నింపుకుని కష్టపడి చదివి, ఉద్యోగాలు వస్తాయని కలలు కంటే పేపర్ లీకేజీతో నిరుద్యోగుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం మట్టి కొట్టిందని ఫైర్ అయ్యారు.
రాత్రి, పగలు లేకుండా కష్టపడి చదివిన నిరుద్యోగులు నిరాశకు గురయ్యారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్ పేరుతో కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. సిట్ దర్యాప్తు అధికారి ఏఆర్ శ్రీనివాస్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయన్నారు. సిట్ మీద తమకు నమ్మకం లేదని, సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి చుట్టంగా మారిందని ఆరోపించారు. వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. వెంటనే టీఎస్పిఎస్సీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. బోర్డు చైర్మన్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసును ఇలాగే కాలయాపన చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎంపీలను రాష్ట్రంలో తిరగనీయమని- హెచ్చరించారు.