బండి సంజయ్‌కు మరోసారి నోటీసులు.. హాజరు కాకపోతే చర్యలు తప్పవని వార్నింగ్!
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌పై విచారణను ఆయన కోరిక మేరకు ఈ నెల 18వ తేదీన అనుమతిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి బండి సంజయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు సోమవారం జారీ చేసింది.
ఈ మేరకు మహిళా కమిషన్ బండి సంజయ్‌ను మార్చి 15వ తేదీన కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించగా తనకు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో 15వ తేదీన కమిషన్ ఎదుట హాజరుకాలేనని, ఈ నెల 18న కమిషన్ చైర్ పర్సన్ సూచించిన సమయానికి హాజరవుతానని లేఖలో అభ్యర్థించారు. దీనిపై కమిషన్ సానుకూలంగా స్పందించి 18న ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించింది. 18న హాజరు కాలేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసు ద్వారా హెచ్చరించింది. కాగా, తాను విచారణకు హాజరుకావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు మాత్రం మహిళా కమిషన్ వివరణ ఇవ్వలేదని సమాచారం.