అధిష్ఠానం ఆదేశంతో అలర్ట్‌లో టీబీజేపీ

Update: 2024-10-05 03:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో:   తెలంగాణ బీజేపీ నేతలు మెంబర్‌షిప్ డ్రైవ్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అలర్ట్ అయిన రాష్ట్ర నాయకత్వం రెండు రోజుల పాటు పూర్తిగా పార్టీ సభ్యత్వ నమోదుకే సమయాన్ని కేటాయించనుంది. ఈ మేరకు శని, ఆదివారాల్లో పార్టీ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా శని, ఆదివారాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా స్టేట్ యూనిట్ అన్ని యాక్టివిటీస్‌ను రద్దు చేసుకుంది. ప్రతి లీడర్ సభ్యత్వ నమోదుపైనే దృష్టి కేంద్రీకరించాలని పార్టీ స్పష్టం చేసింది. నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా అన్నీ వాయిదా వేసుకోవాలని రాష్ట్ర నాయకత్వం సూచనలు చేసింది.

పార్టీ స్టేట్ ఆఫీసులో మీటింగ్ రద్దు

వాస్తవానికి శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో స్టేట్ ఆఫీస్ బేరర్స్‌తో మీటింగ్ నిర్వహించాల్సి ఉంది. అలాగే పార్టీ ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షులు, జిల్లా సభ్యత్వ ఇన్‌చార్జీలు, సభ్యత్వ కన్వీనర్లతోనూ ఆయన సమావేశం నిర్వహించాలని అనుకున్నారు. ఈ మీటింగులో సభ్యత్వాలు, పార్టీ భవిష్యత్ ప్రణాళికలు, కార్యక్రమాలు, ప్రభుత్వంపై ప్రజాందోళనలు వంటి అంశాలపై చర్చించాలని భావించారు. కానీ హైకమాండ్ నుంచి భారీ స్థాయిలో సభ్యత్వాలను చేపట్టాలని ఆదేశాలు రావడంతో ఈ మీటింగ్‌ను స్టేట్ యూనిట్ రద్దు చేసుకుంది. నాయకులు ప్రతి బూత్‌కూ వెళ్లి సభ్యత్వాలను చేపట్టాలని పార్టీ ఆదేశించింది. శని, ఆదివారాలకు తోడుగా దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో పార్టీకి ఈ స్పెషల్ డ్రైవ్ ప్లస్ అవుతుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.


Similar News