వికటించిన మధ్యాహ్న భోజనం..16 మంది విద్యార్థులకు అస్వస్థత

కల్వకుర్తి మండల పరిధిలోని తాండ్ర ప్రభుత్వ పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం వికటించి 10మంది అస్వస్థతకు గురయ్యారు.

Update: 2023-02-16 15:41 GMT

దిశ, కల్వకుర్తి: కల్వకుర్తి మండల పరిధిలోని తాండ్ర ప్రభుత్వ పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం వికటించి 10మంది అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం నాణ్యమైనదిగా ఉండాలని సర్కారు పదే పదే హెచ్చరిస్తున్నా, భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ క్రమంలో కల్వకుర్తి మండలంలో మరోసారి విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని ఐదుగురు ఆసుపత్రి పాలు కాగా, ఇంకో 11 మంది ఆశావర్కర్లు ఇచ్చిన మందులతో రికవరీ అయ్యారు.

విద్యార్థులు కథనం ప్రకారం.. ముందుగా 6 వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఈ భోజనంలో ఉడకని అన్నం, ఆలుగడ్డ వడ్డించడం ద్వారా 16 మంది విద్యార్థులకు వాంతులు మొదలవడంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది 108కి సమాచారమిచ్చారు. అనంతరం ఐదుగురు విద్యార్థులకు వాంతులు అధికమవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయంపై విద్యార్థులను 'దిశ' ప్రతినిధి ఆసుపత్రికి వెళ్లి వివరాలు అడగగా అన్నం, ఆలుగడ్డ ఉడకలేదని, నీళ్ల పప్పుచారు పెట్టారని విద్యార్థులు తెలిపారు. ఆరవ తరగతి చదువుతున్న సురేందర్, గణేష్, యశ్వంత్, సూర్య తేజ, రాకేష్ లు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా తాండ్ర, గోకారం గ్రామవాసులు.

ప్రతిరోజు పురుగులతో కూడిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు. సర్కారు నిబంధనల ప్రకారం మధ్యాహ్న భోజనం ముందుగా పాఠశాల హెచ్ఎం భుజించిన అనంతరం విద్యార్థులకు వడ్డించాలి కానీ, ఎక్కడ అలా జరగడం లేదు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని బీఎస్పీ, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై సమాచారం తల్లిదండ్రులు ఆందోళనతో ఆసుపత్రికి చేరుకున్నారు. తమ బిడ్డలు ఆరోగ్యంగా తిరిగి రావాలని వారికి ఎటువంటి ప్రమాదం జరుగకూడదని మొక్కుకున్నారు. విచారణ జరిపి అలసత్వం వహించి విద్యార్థులు అనారోగ్యాలకు కారణమైన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు.

ప్రస్తుతం విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సందీప్ తెలిపారు. ఉడకని అన్నం ఆలుగడ్డ వడ్డించడం వల్లే పిల్లలు అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం. వివరణ కోసమై ఏంఈఓ, డీఈఓలకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. ఆహారం వండే విషయంలో అజాగ్రత్తగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటారో లేదో వేచిచూడాలి.

Tags:    

Similar News