ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, వాణిజ్య మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, వాణిజ్య మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాజధానిగా మార్చే లక్ష్యంతో గ్లోబల్ రంగంలో ఏఐ వృద్ధి చేయనున్నట్లు తెలిపారు. 200 ఎకరాల్లో స్పెషల్ పార్కు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఆటా బిజినెస్ సెమినార్‌లో పాల్గొని ప్రసంగించారు. స్థిరమైన ఐటీ, పరిశ్రమల అభివృద్ధికి బలమైన సంస్కృతిని పెంపొందించడం జరుగుతుందన్నారు.
ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు పరిశ్రమలకు సాధికారత, వ్యవస్థాపకతను పెంపొందించడం, శ్రామికశక్తి నైపుణ్యాలను పెంపొందించే విధానాలను ప్రోత్సహించడం ద్వారా సమృద్ధిగా ఉపాధి అవకాశాలను సృష్టించడం జరుగుతుందన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను హైదరాబాద్‌కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ చేయనున్నామని తెలిపారు. సెమీకండక్టర్స్, మెడికల్ డివైజ్‌ల కోసం బిల్డింగ్ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నామన్నారు. సెమీకండక్టర్లపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, సెమీకండక్టర్ స్థలంలో ఏర్పాటు చేయడానికి ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదని, దాని పై పని చేయడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలలో సమ్మిళిత అభివృద్ధిని నిర్ధారించడానికి విద్య మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాలకు సంబంధించిన మెరుగైన ప్రభుత్వ విధానాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్ సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు వికేంద్రీకృత వృద్ధి మరియు పారిశ్రామిక విధానం రూపొందిస్తున్నామని తెలిపారు. మధ్య, చిన్న స్థాయి కంపెనీలకు వర్గీకరణపరంగా మద్దతు ఇవ్వనున్నామన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, అమెరికన్ భారతీయులకు ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ గ్రామీణ అభివృద్ధి పథంలో వ్యాపారవేత్తలు పాల్గొనాలని ఆహ్వానించారు.