దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు వార్డు, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే ఇందుకు సంబంధించి విధి విధానాలను రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందు కోసం ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. గతంలో కమిటీల ఏర్పాటు ఎలా ఉందో స్టడీ చేస్తున్నట్లు సమాచారం. ఆయా కమిటీల విధి విధానాలు, సభ్యులుగా ఎవరెవరు ఉండాలో అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి విధి విధానాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వాటిని రూపొందించిన వెంటనే అర్హుల కుటుంబాలను గుర్తించే ప్రక్రియను షురూ చేయాలని చెప్పారు. దసరా నాటికే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కావాలని చెప్పడంతో అధికారులు వేగంగా పని చేస్తున్నారు. కాగా, వైఎస్సార్ హయాంలో జారీ చేసిన ఇందిరమ్మ కమిటీల జీవోలకు సంబంధించి కాపీలు అందుబాటులో లేకపోవడంతో, ఎవరి వద్ద ఉండే అవకాశాలున్నాయో తెలుసుకొని వాటిని తమకు పంపాలని అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం.
డిప్యూటేషన్ల మీద వెళ్లిన హౌసింగ్ అధికారులకు స్పెషల్ ఆదేశాలు:
వివిధ విభాగాలు, కార్పొరేషన్లలో డిప్యూటేషన్ పై వెళ్లిన హౌసింగ్ ఉద్యోగులు సొంత గూటికి తిరిగి వచ్చేయాలని ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల్లో డిప్యూటేషన్ పై పని చేస్తున్న 242 మంది ఉద్యోగులను రిలీవ్ చేయాలని సంబంధిత శాఖలకు లేఖ రాశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. సిబ్బంది కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. కాగా, హౌసింగ్ డిపార్ట్ మెంట్ కు చెందిన 78 మంది ఉద్యోగులు వివిధ శాఖల్లో పని చేస్తుండగా, 164 మంది పలు కార్పొరేషన్లలో సేవలందిస్తున్నారు. అయితే, అత్యధికంగా జీహెచ్ ఎంసీలోనే 67 మంది ఉండడం గమనార్హం.