TG Assembly : హరీష్ రావు.. కేటీఆర్.. సభా మర్యాదలు పాటించండి: స్పీకర్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదవ రోజు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదవ రోజు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా మాట్లాడారని, ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బ్లాక్ డ్రెస్ వేసుకురావడంపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ చేశారు.
తమ ఆవేదన అర్థం చేసుకొని మీరు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చి మాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు సార్ అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. దీనికి స్పీకర్ కూర్చోండి.. కూర్చోండి హరీష్ రావు గారు... అంటూ విజ్ఞప్తి చేశారు. అయితే సభలో మంత్రి శ్రీధర్ బాబు స్కిల్ యూనివర్సిటీపై చర్చ జరుపుతున్నారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు లేచి తమకు మైక్ ఇవ్వాలని పట్టుబట్టారు.
దీంతో స్పీకర్ మాట్లాడుతూ.. మీకు సభ నడవాలని లేదా? బిల్లు పాస్ చేయాలని లేదా? కూర్చోండి సభ మర్యాదలను కాపాడండి.. హరీష్ రావు మీరు కూర్చోండి.. మీకు అవకాశం ఇస్తాను.. అంటూ స్పీకర్ ఫైర్ అయ్యారు. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ పై ఫైర్ స్పీకర్ ఫైర్ అయ్యారు. మీరు సభ నాయకుడిపై మీకు ఇష్టమొచ్చినట్లు రుద్దకండి.. అనుభవమైన లీడర్లు మీరు.. మీ ప్రయోజనాల కోసం మీరు మాట్లాడకండి.. సభా మర్యాదలు పాటించి కూర్చోండి అంటూ కోరారు.