వివాదంలో Chaganti Koteswara Rao .. ఆ పురస్కారమే కారణమా?
చాగంటికి గురజాడ పురస్కారం ఇవ్వడాన్ని కొంతమంది హేదువాదులు ప్రశ్నిస్తున్నారు.
దిశ, వెబ్ డెస్క్: 2022 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక గురజాడ పురస్కారానికి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఎంపికయ్యారు. ఈ మేరకు ఈ నెల 30న చాగంటికి గురజాడ స్వగృహంలో జరిగే ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. అయితే గురజాడ పురస్కారాన్ని చాగంటి కోటేశ్వర రావుకు ఇవ్వడాన్ని హేతువాదులు, రచయితలు ప్రశ్నిస్తున్నారు. జీవితాంతం హేతువాదిగా బతికిన గురజాడ అప్పారావు పురస్కారాన్ని ఒక ఆధ్యాత్మిక వేత్త అయిన చాగంటికి ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు. పురాణాలు చెప్పి అందరూ ఆ పాత రోజులకు వెళ్లాలని చాగంటి సూచిస్తారని.. గురజాడ మాత్రం గతాన్ని వదిలి ఉత్సాహంతో ముందుకెళ్లాలని చెప్పేవారని గుర్తు చేస్తున్నారు.
గురజాడకు చాగంటికి ఏ విషయంలోనూ పోలికలు లేవని, అలాంటప్పుడు ఆయనకు పురస్కారాన్ని ఇవ్వడంలో అర్థంలేదని వారు ఆరోపిస్తున్నారు. కాగా.. ఇప్పటివరకు ఈ అవార్డును చాలా మంది ప్రముఖులు అందుకున్నారు. జేవీ సోమయాజులు, గొల్లపూడి మారుతీరావు, డాక్టర్ సి.నారాయణ రెడ్డి, కె.విశ్వనాధ్, గుమ్మడి, షావుకారు జానకి, మల్లెమాల, అంజలిదేవి, రావి కొండలరావు, వంశీ, భరణి, చాట్ల, మొదిలి నాగభూషణ శర్మ, సుద్దాల, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, గరికపాటి నరసింహారావు, డాక్టర్ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, డైరెక్టర్ క్రిష్, గేయరచయిత రామజోగయ్యశాస్త్రి అందుకున్నారు.