హైదరాబాద్‌లో పెరుగుతున్న స్నేక్ వెనమ్ డ్రగ్స్.. మెయిన్ టార్గెట్ ఇవే!

మాయదారుల్లో వచ్చి యువతను చేరి వారి జీవితాలను చిత్తు చేస్తున్నాయి. కొద్ది నిమిషాల మత్తుకు నేటి తరం యువతీయువకులు తమ మొత్తం జీవితాన్ని తాకట్టు పెడుతున్నారు.

Update: 2024-10-01 17:35 GMT

మాయదారుల్లో వచ్చి యువతను చేరి వారి జీవితాలను చిత్తు చేస్తున్నాయి. కొద్ది నిమిషాల మత్తుకు నేటి తరం యువతీయువకులు తమ మొత్తం జీవితాన్ని తాకట్టు పెడుతున్నారు. ఇటీవల డ్రగ్స్ కేసులు విస్తృతంగా వెలుగులోకి రావడం.. రోజుకోచోట పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడుతుండడంతో.. మన పిల్లలు ఎంత వరకు సేఫ్ అని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పసి హృదయాలను గుల్ల జేసి ఆయుష్షును క్షీణింపజేస్తున్న డ్రగ్స్‌తో జర భద్రం అంటూ నిపుణులు తెలియజేస్తున్నారు. = కల్లేపల్లి రవిచంద్ర

చిన్న వయస్సులోనే..

బాచుపల్లిలో ఇంటర్ చదివే విద్యార్థి ఆనారోగ్యానికి గురయ్యాడు. తల్లిదండ్రులు అతన్ని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. పరీక్షించిన వైద్యులు అతని కిడ్నీ, లివర్ పాడైనట్లు చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు మా కుమారుడికి ఏ అలవాట్లు లేవు. లివర్, కిడ్నీలు ఎలా పాడవుతాయని..? ప్రశ్నించారు. దీంతో వైద్యులు చిన్న వయస్సులోనే మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్లనే ఈ సమస్య వచ్చినట్టు చెప్పారు. ఇదే విషయమై అబ్బాయిని తల్లిదండ్రులు ప్రశ్నించగా.. బాబాయి కారణంగానే డ్రగ్స్ అలవాటు అయినట్టు చెప్పాడు. దీంతో అతడిని నిలదీయగా అసలు బాగోతం బయటపడింది. ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న సదరు వ్యక్తి ఉదయాన్నే టిప్ టాప్‌గా తయారై డ్యూటీకి వెళ్తుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్తున్నాడు. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకుంటున్నాడు. అయితే అతను డ్యూటీకి వెళ్లకుండా మాదాపూర్‌లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకొని మాదకద్రవ్యాలను తీసుకుంటూ మత్తులో జోగుతున్నాడు. ఇంట్లో ఒకే రూమ్‌లో ఉండటంతో బాబాయ్ చేస్తున్న పనేమిటో ఆ అబ్బాయి కనిపెట్టాడు. తనకు కూడా డ్రగ్స్ కావాలని, లేదంటే ఇంట్లో చెబుతానని బెదిరించడంతో అతడికి అందజేశాడు. ఫలితంగా ఇద్దరు డ్రగ్స్ రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. మైనర్ కావడంతో త్వరగా కిడ్నీలు, లివర్ పాడై అనారోగ్యానికి గురయ్యాడు.

వైద్య విద్యార్థి ఆశలు ఆవిరి..

డాక్టర్ కావాలన్న ఆశతో ఆ యువతి రాత్రింబవళ్లు కష్టపడింది. మెడిసిన్‌లో సీటు సంపాదించి.. ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అంతే ఉత్సాహంతో పీజీలోనూ చేరింది. చదువు నిమిత్తం హాస్టల్‌లో ఉండటం వల్ల స్నేహితులతో డ్రగ్స్‌కు అలవాటు పడింది. కొద్దికాలానికే ఆ వ్యసనానికి పూర్తిగా బానిసై తన జీవితాన్ని మొత్తం నాశనం చేసుకొంది. ఇటీవల రంగారెడ్డి జిల్లా అబ్కారీ డిప్యూటీ కమిషనర్ దశరథ్ చేపట్టిన తనిఖీల్లో ఈ ఘటన వెలుగు చూసింది. అమ్మాయికి తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇప్పించినా.. ఆమెలో మార్పు రాలేదు. దీంతో ఎక్సైజ్ పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తూ.. మామూలు స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, గంజాయి, కొకైన్, ఎల్ఎస్‌డీ, ఎండీఎంఏ, ఎల్‌హెచ్‌డీ తదితరాలు మాదకద్రవ్యాలుగా పేర్కొంటారు. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకంటే మనిషి శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం జనాభా అనగా 185 మిలియన్ల మంది మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనా. డ్రగ్స్‌కు ప్రముఖులు, వారి పిల్లలు సైతం బానిసలుగా మారిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. మాదకద్రవ్యాలకు బానిసైనవారు ఎంతటి నేరాలు చేసేందుకైనా వెనుకాడరు. దీంతో భారత ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు నార్కొటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్సెన్సస్ చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టంతో మత్తు మందు పండించినా, వ్యాపారం చేసినా, డ్రగ్స్ కలిగి ఉన్నా శిక్షార్హులు. తెలంగాణలో డ్రగ్ నియంత్రణకు టీజీ న్యాబ్, ఎక్సైజ్, పోలీసులు ముప్పేట దాడులు నిర్వహిస్తున్నారు. పబ్బులు, స్టార్ హోటళ్లు డ్రగ్స్ హాట్‌స్పాట్‌లుగా మారాయని, విద్యాసంస్థలు, ఐటీ కంపెనీల్లో డ్రగ్స్ అమ్మకాలకు టార్గెట్ అయ్యాయని అధికారులు చెప్తున్నారు.

యుక్త వయస్సులోనే..

అవసరానికి మించి డబ్బు చేతుల్లో ఉండటంతో ఉద్యోగం చేస్తున్న యువతే కాకుండా.. విద్యార్థులు కూడా కొత్త నిషా కోసం డ్రగ్స్‌కు ఆకర్షితులవుతున్నారు. కాలేజ్‌లు, పాఠశాలల వద్ద డ్రగ్స్ ను చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. సంపన్న వర్గాల పిల్లలు చదివే స్కూళ్లు, కాలేజీలను డ్రగ్స్ వ్యాపారులు టార్గెట్ చేస్తున్నారు. మాదాపూర్, బంజారా‌హిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, మణికొండ, గండిపేట, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాలలో డ్రగ్స్ విచ్చలవిడిగా చెలామణి అవుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు. కాగా విద్యార్థులు 80 శాతం, ఉద్యోగులు 20 శాతం డ్రగ్స్ వాడుతున్నట్లు పోలీసుల అంచనా.

క్లౌడ్ హౌస్‌ల‌లో రేవ్ పార్టీలు

మాదాపూర్‌లో ఇటీవల క్లౌడ్ హౌస్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ రేవ్ పార్టీలో 26 మంది పట్టుబడగా వీరిలో 20 మంది యువకులు, ఆరుగులు యువతులు ఉన్నారు. 42 కండోమ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంపన్న వర్గాలు ఉన్న ప్రాంతాల్లో క్లౌడ్ హౌస్‌లలో రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. ఈ రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలను సప్లై చేస్తూ.. అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటివి వీకెండ్స్‌లో తరుచూ జరుగుతున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా బాయ్స్, ఉమెన్స్ హాస్టళ్లలోనూ డ్రగ్స్ వాడకం పెరిగింది. ఇటీవల వెంకటేశ్వర ఎగ్జిక్యూటివ్ పీజీ హాస్టల్‌లో జరిపిన పోలీసుల తనిఖీలలో డ్రగ్స్ బయటపడిన విషయం విదితమే.


పబ్‌లలో డ్రగ్స్ దందా..

గ్రేటర్ హైదరాబాద్‌లో వందకు పైగా పబ్బులున్నాయి. కొన్ని పబ్బుల్లో డ్రగ్స్ దందా యథేచ్చగా సాగుతున్నది. పబ్‌కు వచ్చిన యువతను డ్రగ్స్ ద్వారా ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. టీజీ న్యాబ్ పోలీసులు దాడుల్లో డ్రగ్ పెడ్లర్లు పబ్బుల్లో చిక్కుతుండడం ఇందుకు ఉదాహరణ. కొందరు డీజేల పాత్రపై పోలీసులు నజర్ పెట్టారు. వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేసే డీజేలు.. పబ్బుల యాజమానులతో పాటు దేశవ్యాప్తంగా ఈవెంట్ ఆర్గనైజర్స్‌, డ్రగ్స్ సరఫరా ముఠాలు, నైజీరీయన్లతో సంబంధాలు నెరుపుతున్నారు. ఇటీవల పోలీసులు డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో నిర్వహించిన పరీక్షల్లో డీజేలు పట్టుబడ్డారు.

రేవ్ పార్టీలలో..

బెంగళూరు రేవ్ పార్టీలో సినీ నటులతోపాటు ప్రముఖులు డ్రగ్స్ టెస్టులో అడ్డంగా బుక్ అయిన విషయం విదితమే. అయితే హైదరాబబాద్‌లోని సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుని బర్త్ డే పేరిట రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో 14 మంది యువకులు, ఆరుగురు యువతులు ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారి నుంచి విదేశీ మద్యంతోపాటు కొకైన్, ఎండీఎంఏ డ్రగ్, ఓజీ కుష్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి రేవ్ పార్టీలకు అమ్ముతున్న సరఫరాదారులను పోలీసులు ఆరెస్ట్ చేశారు.

డ్రంకెన్ డ్రైవ్ తరహాలోనే తనిఖీలు..

డ్రగ్స్ సరఫరా, వినియోగంపై నార్కోటిక్ బ్యూరో అధికారులు డ్రంకెన్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించేందుకు రేడీ అవుతున్నారు. ప్రధానంగా కార్పొరేట్ కాలేజీల విద్యార్థులు, ఐటీ కంపెనీల ఉద్యోగులు మత్తు బారిన పడుతున్నట్లు గుర్తించారు. ఈవెంట్స్ జరుగుతున్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. ఆ ప్రదేశాన్ని సముహంగా తీసుకొని ర్యాండమ్ గా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్లాన్ వేస్తున్నారు. గంజాయి తీసుకున్న వారిలో 4 వారాలు, డ్రగ్స్ తీసుకున్న వారిలో 3 నెలల పాటు మత్తు అనవాళ్లు ఉంటాయి. పరీక్షల్లో వచ్చిన ఫలితాన్ని బట్టి మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వారిని గుర్తించి, విచారిస్తారు. డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు.? ఎక్కడ కొన్నారు.? ఎంతమందితో కలిసి సేవిస్తున్నారు..?తదితర వివరాలను రాబడుతారు. వారిచ్చిన సమాచారంతో డ్రగ్స్ స్మగ్లర్ల లింకులను పట్టుకోనున్నారు.

సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ ఎందుకంటే..?

సినీ పరిశ్రమలో డ్రగ్స్ మాఫియా కొత్త కాదు.2017లో టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు భారీగా ప్రకంపనలు రేపింది. సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు మాదకద్రవ్యాలు కేసుల్లో పట్టుబడి, పలుమార్లు విచారణలు ఎదుర్కొన్నారు. టాలీవుడ్‌ను షేక్ చేసిన అలెక్స్ ను పట్టుకోవడంతో సినీ తారలు పేర్లు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. ఈ కేసుపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిట్ నియమించి విచారణ చేపట్టారు. రవితేజ, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా, పూరి జగన్నాథ్, నవదీప్, తరుణ్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలను విచారించి, వారి నుంచి గోళ్లు, వెంట్రుకల నమానాలను సేకరించిడం అప్పట్లో సంచలనం రేపింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు అప్పట్లో దూమారం రేగింది. ఏం జరిగిందో తెలియదు కానీ అతడికి క్లీన్ చిట్ వచ్చింది. తాజాగా కబాలి తెలుగు నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో ఆరెస్టు కావడంతో మరోసారి తెలుగు చిత్రసీమను డ్రగ్స్ విషయం కుదిపేసింది. ఫిట్‌నెస్ , సౌందర్యం కోసం కూడా డ్రగ్స్ తీసుకుంటారని కొందరు చెప్తున్నా.. దీనివల్ల భవిష్యత్తు అంధకారం అవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ మధ్య హీరోయిన్స్ కంగనా రనౌత్, మాధవీలత వంటి వారు సినీ ఇండస్ట్రీలో జరిగే పార్టీల్లో డ్రగ్స్ కంపల్సరీ అని కామెంట్స్ చేసిన విషయం విదితమే.

మత్తు సరిపోక పాము విషం..

రేవ్ పార్టీల్లో మాదక ద్రవ్యాలు సాధారణంగా కనిపించేవి. ఇప్పుడు ఆ మత్తు కూడా సరిపోక పాము విషాన్ని కూడా మత్తుపదార్థంగా తీసుకుంటున్నారు. చాలామంది సెలెబ్రిటీలు పాము విషాన్ని డ్రగ్‌లా వాడుతున్నట్లు సమాచారం. ప్రముఖ యూట్యూబర్, ఓటీటీ ‘బిగ్ బాస్’ విజేత ఎల్విష్ యాదవ్, రేవ్ పార్టీల్లో పాము విషాన్ని విక్రయించిన ఆరోపణలపై అరెస్టు అయిన విషయం విదితమే. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న శాంపిల్స్‌లో నాగు పాము, క్రైట్ జాతుల విషం ఉన్నట్లు ఫొరెన్సిక్ విచారణలో తేలింది. ఈ సంస్కృతి గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్‌కూ పాకిందని సమాచారం.

స్నేక్ వెనమ్ అడిక్షన్ అంటే..

అంత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన నాగు పాము విషానికి రేవ్ పార్టీలలో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. పాము విషాన్ని పౌడర్‌గా ప్రాసెస్ చేస్తారు. డ్రగ్స్ మాఫియాలో ఇదొక ఘెరమైన రూపంగా అవతరిస్తున్నది. ఈ పౌడర్‌లోని న్యూరో టాక్సిన్‌ల కారణంగా విపరీతమైన మత్తు రావడంతోపాటు, ఇతర అనేక రకాల లక్షణాలను ప్రేరేపిస్తుంది. ఈ రకమైన వ్యసనాన్ని అఫిడిజం అని పిలుస్తారు. దీంతో ఎక్కువ గంటలు నృత్యం చేయగలరు. ఈ పౌడర్ బలాన్ని బట్టి ఆరు నుంచి ఏడు గంటల లేదా ఐదారు రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. కానీ, దీనిని వాడటం వల్ల మనిషి నరాలు, వెన్నెముక సామర్థ్యం కోల్పోయి జీవచ్ఛవంలా మారే ప్రమాదమున్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం: డాక్టర్ పుట్ల శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర డీఎంఅండ్‌హెచ్ఓల సంఘం అధ్యక్షుడు

మాదక ద్రవ్యాల వాడం మనిషిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. డ్రగ్స్ సేవించిన తర్వాత మెదడులో డోపమైన్, సెరటోనిన్ అనే ఉత్ర్పేరకాలు విడుదల అవుతాయి. వాటివల్ల హుషారుగా ఉత్తేజంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అది కొద్దిసేపే ఉంటుంది. దాంతో మళ్లీ మళ్లీ మత్తు పదార్థాలు తీసుకోవాలని అనిపిస్తుంది. ఇలా క్రమంగా ఒక వ్యక్తి వాటికి బానిస అయిపోతాడు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కిడ్నీలు, లివర్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సంతాన సమస్యలు తీవ్రంగా ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లలను నిత్యం గమనిస్తూ ఉండాలి. చెడు మార్గాల్లో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం: వీబీ కమలాసన్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ టీఎస్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్

రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. ముఖ్యంగా సిటీలో ఎండీఎంఏ, ఎల్‌హెచ్‌డీ బ్లాస్ట్, హ్యాష్ ఆయిల్ లాంటి మాదకద్రవ్యాలను పట్టుకుంటున్నాం. సముద్రం మార్గం ద్వారా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే డ్రగ్స్‌పై గట్టి నిఘా ఏర్పాటు చేశాం. మరోపక్క గంజాయి కోసం హైదరాబాదులో జల్లెడ పడుతున్నాం. ఆంధ్ర- ఒడిశా బోర్డర్ నుంచి వచ్చే గంజాయిని ఖమ్మం కేంద్రంగా భారీ మొత్తంలో సీజ్ చేస్తున్నాం. ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసు విభాగాలు ప్రత్యేక టీములు పనిచేస్తూ డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తున్నాయి. డ్రగ్స్ పట్టుకోవడానికి టీజీ న్యాబ్, పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నాం. డ్రగ్స్ బారిన పడకుండా యువతను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు పర్యవేక్షిస్తూ వాటి నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. డ్రగ్ సమాచారం తెలిస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 25 23కి ఫోను చేయాలని కోరుతున్నాం.


Similar News