కొడుకుని చంపారనే కోపంతో ఐదుగురిని చంపేందుకు స్కెచ్!
నిజామాబాద్ లో ఈనెల 16న యువకుడిపై కత్తిపోట్ల ఘటనలో ఇద్దరిని అరెస్టు చేసినట్టు నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు
దిశ , నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలో ఈనెల 16న పట్టపగలు యువకుడిపై కత్తిపోట్ల ఘటనలో ఇద్దరిని అరెస్టు చేసినట్టు నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 19న హామల్‌వాడిలో సాయంత్రం 4 గంటలకు చాట్ల గోపి అలియాస్ షాపురం గోపి, మానే ప్రకాష్‌లను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు.
ఈ నెల 16న నిజామాబాద్ సుబాష్‌నగర్ నిర్మల హృదయ చౌరస్తా వద్ద మానే శివ కుమార్‌ను నగరంలోని మిర్చి కాంపౌండ్‌కు చెందిన షాపురం గోపి అలియాస్ చాట్ల గోపి, మేడ్చల్ జిల్లాకు చెందిన మన్నే ప్రకాష్‌లు శివను చంపాలనే ఉద్దేశంతో కత్తితో పొడిచారని తెలిపారు. ఏ1 షాపురం గోపి, ఏ2 మానే ప్రకాష్‌లు కత్తితో దాడి చేయగా శివకుమార్ తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడని తెలిపారు. మానే శివకుమార్ ఫిర్యాదు మేరకు మూడవ టౌన్ ఎస్సై జి. శ్రావణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా దర్యాప్తులో భాగంగా ఆదివారం హమాల్వాడిలో ఏ1 - షాపురం గోపి అలియాస్ చాట్ల గోపి, ఏ 2 - మానే ప్రకాష్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా వారు తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నాన్నారు. చాట్ల గోపి కుమారుడైన చాట్ల శివను జనవరిలో మానే శివకుమార్ మరో నలుగురితో కలిసి బోధన్‌లో మర్డర్ చేయగా హత్యకు పాల్పడిన ఐదుగురిని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో గోపి అతని స్నేహితుడైన ప్రకాష్ సహాయంతో ఆ ఐదుగురిలో ఒకరైన మానే శివ కుమార్‌ను ఈ నెల 16న చంపడానికి ప్రయత్నించాడన్నారు.
ఈ కేసులో నిందితులు నేరాన్ని ఒప్పుకోగా నిందితులు చంపడానికి ఉపయోగించిన కత్తి, ఒక మోటార్ సైకిల్‌ను వారి నుంచి స్వాధీన పరుచుకొని ఇద్దరు నేరస్తులను రిమాండ్‌కి పంపినట్లు తెలిపారు. షాపురం గోపి అలియాస్ చాట్ల గోపిపై 16 దొంగతనాలు, ఒక దాడి కేసు, ఒక మర్డర్ కేసు ఉన్నాయని తెలిపారు. ప్రకాష్‌పై ఆరు కేసులు ఉన్నాయని ఏసీపీ తెలిపారు.