బ్రేకింగ్: T-బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసిన సిట్
టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నోటీసులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను దర్యాప్తు బృందానికి సమర్పించాలని నోటీసుల్లో సిట్ ఆదేశించింది. ఈ నెల 24వ తేదీన సిట్ ఎదుట హాజరవ్వాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఈ నోటీస్ మరి కాసేపట్లో బండి సంజయ్‌కు చేరనుంది.
మంత్రి కేటీఆర్ పీఏ గ్రామంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో వందమందికి వందకు పైగా మార్కులు వచ్చాయని బండి సంజయ్ ఆరోపించారు. అంతేకాకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై అయిన వారిలో ఎక్కువగా బీఆర్ఎస్ నేతల పిల్లలే ఉన్నారంటూ బండి సంచలన ఆరోపణలు చేశారు. కాగా, టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీపై ఆరోపణలు చేస్తోన్న రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేయాలని ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సిట్ బృందం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సైతం సోమవారం సిట్ నోటీసులు జారీ చేసిన సిట్.. తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నోటీసులపై బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.