రాహుల్ గాంధీ ఎంట్రీతో సీన్ చేంజ్.. ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు మరో కొత్త టెన్షన్..!

రాష్ట్రంలో పార్టీలు ప్రచారం పర్వాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ విమర్శల డోస్ పెంచుతున్నాయి. ఈ క్రమంలో హామీల వర్షం కురిపిస్తూనే

Update: 2023-10-21 08:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో పార్టీలు ప్రచారం పర్వాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ విమర్శల డోస్ పెంచుతున్నాయి. ఈ క్రమంలో హామీల వర్షం కురిపిస్తూనే ప్రత్యర్థులను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో సింగరేణి ఓట్ల కోసం ప్రధాన పార్టీలు ఫోకస్ పెంచాయి.

తాజాగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తన విజయభేరి బస్సు యాత్రలో భాగంగా రామగుండంలో సింగరేణి కార్మికులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. అయితే సింగరేణి ఏరియాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ హావా కొనసాగించింది. తాజాగా రాహుల్‌ను రంగంలోకి దింపడం ద్వారా మరోసారి సత్తా చాటాలని చూస్తుండటంతో ఈ పరిణామాలు అధికార బీఆర్ఎస్‌కు టెన్షన్‌గా మారిందనే టాక్ వినిపిస్తోంది.

టార్గెట్ కోల్ బెల్ట్:

అసెంబ్లీ ఎన్నికల వేళ సింగరేణి కార్మికుల సమస్యలు, వారి ఓట్ల విషయం చర్చనీయాశం అవుతోంది. సింగరేణి బొగ్గు గనులున్న ప్రాంతాన్ని కోల్ బెల్ట్ అంటారు. తెలంగాణలోని కొమురం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్, రామగుండం, పెద్దపల్లి, మంథని, భూపాలపల్లి, పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఈ కోల్ బెల్ట్ పరిధిలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక నియోజకవర్గాలను కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకోగా సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి గెలిచారు.

ఈ ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఇక ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, చెన్నూరు స్థానాలు బీఆర్ఎస్ ఖాతాలో, రామగుండంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీచేసిన బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాలతో కోరుకంటి చందర్ ఫార్వర్డ్ బ్లాక్, గండ్ర వెంకటరమణారెడ్డి (కాంగ్రెస్), వనమా వెంకటేశ్వర రావు (కాంగ్రెస్), బానోత్ హరిప్రియ(కాంగ్రెస్), సండ్ర వెంకటవీరయ్య (టీడీపీ)లు బీఆర్ ఎస్‌లో చేరారు. అయితే కార్యకర్తల బలంతో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారారని తమకు క్షేత్రస్థాయిలో బలం ఉందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది.

కార్మికుల పట్ల బీఆర్ఎస్ నిర్లక్ష్యం:

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అసంతృప్తి ఉంది. ఏళ్లు గడుస్తున్నా తమ సమస్యలను పట్టించుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పేరుతో రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. సింగరేణి కార్మిక ఎన్నికల సంఘానికి గుర్తింపు ఎన్నికల విషయంలో ప్రభుత్వం చేసిన తాత్సార్యంపై కార్మికులు గుర్రుగా ఉన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో చర్చనీయాశంగా మారింది. ఈ అంశంలో ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఇంతలో ఇటీవల సింగరేణి కార్మికులతో సమావేశమైన రాహుల్ గాంధీ సింగరేణి ప్రవేటీకరణ జరగనివ్వబోమని హామీ ఇచ్చారు.

కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో ఈ ఏరియాలో కాంగ్రెస్ పట్టు బిగిస్తోందన్న చర్చలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దీంతో రాహుల్ టూర్ ఇంపాక్ట్ కార్మికులపై పడొద్దని బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టిందని ఇందులో భాగంగానే రాహుల్ టూర్ ముగిసిన వెంటనే కార్మికులకు దసరా బోనస్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేసిందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కోల్ బెల్డ్ పరిధిలో ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా చివరకు కార్మికులు చివరకు ఎటు వైపు మళ్లుతారో వేచి చూడాలి.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..