పాత నిర్ణయాలపైనే మంత్రుల సంతకాలు.. సీఎం చెప్పిన అబ్బురపడే పథకం ఎక్కడ?

కొత్త సచివాలయం.. కొత్త ఛాంబర్.. కొత్త ఫర్నీచర్.. అంతా కొత్తదనమే అనుకుంటూ మంత్రులు మురిసిపోయారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన ముహూర్తానికి ఫైళ్లపై సంతకాలు చేశారు.

Update: 2023-04-30 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సచివాలయం.. కొత్త ఛాంబర్.. కొత్త ఫర్నీచర్.. అంతా కొత్తదనమే అనుకుంటూ మంత్రులు మురిసిపోయారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన ముహూర్తానికి ఫైళ్లపై సంతకాలు చేశారు. సంచలన నిర్ణయాలు, పథకాలు ఉంటాయని చాలా మంది భావించారు. కానీ పాత పథకాలు లేదా రోజువారీ జరిగే కార్యకలాపాలకు సంబంధించిన ఫైళ్లే తప్ప కొత్తవేమీ లేదన్న అసంతృప్తి ప్రజల నుంచి వ్యక్తమైంది. ముఖ్యమంత్రి సహా మంత్రులంతా సంతకాలు చేసిన విషయాలు పాత అంశాలకు సంబంధించినవేనని, రోజువారీ జరగాల్సిన యాక్టివిటీకి సంబంధించినవేనని ఆయా శాఖల ఆఫీసర్లే వ్యాఖ్యానించారు. కొత్త సచివాలయంలోకి అడుగు పెడుతున్న వేళ కొత్త స్కీమ్‌ల సంచలనం ఉంటుందని భావించినా అలాంటి అంచనాలు తలకిందులయ్యాయి. పాత నిర్ణయాలకే ఆమోదం తెలుపుతూ మంత్రులు సంతకాలు చేశారు.

కొత్త సచివాలయం భవనంపైనే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విపక్షాలు మంత్రుల కొత్త సంతకాలను కూడా ఎద్దేవా చేశారు. పాలనపైనా, ప్రజలపైనా చిత్తశుద్ధి ఉంటే ఏ సీటులో కూర్చున్నా.. ఏ సంతకం చేసినా తేడా ఉండదని, ఇప్పుడు కొత్త సచివాలయంలోకి కూర్చున్నా పాలనలో వచ్చే మార్పేమీ ఉండదంటూ తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరాం, బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర విపక్ష నేతలు కామెంట్ చేశారు. ఇతర నాయకుల ఆనవాళ్ళు లేకుండా చేయడానికి, కేసీఆర్ తన ప్రతిష్టను చాటుకోడానికే కొత్త సచివాలయాన్ని కట్టుకున్నారని, తొమ్మిదేళ్ళుగా కొనసాగుతున్న అస్తవ్యస్త పాలన ఇప్పుడు బాగుపడుతుందా అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

గతేడాది హామీ ఫైల్‌పై కేసీఆర్ సంతకం

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ వేదికగా మార్చి 9న హామీ ఇచ్చారు. మొత్తం 80,039 రెగ్యులర్ ఉద్యోగాలతో పాటు 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. ఏడాది దాటిపోయినా కొన్ని డిపార్టుమెంట్లలో మాత్రమే రెగ్యులరైజేషన్ ప్రాసెస్ పూర్తయింది. కొత్త సచివాలయంలోని తన చాంబర్‌లోకి అడుగుపెట్టిన తర్వాత తొలి ఫైల్‌గా దానిపైనే కేసీఆర్ సంతకం పెట్టారు. ఆ వెంటనే 5,544 పోస్టులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఇప్పటివరకూ వీరిని రెగ్యులరైజ్ చేయలేదని ప్రభుత్వం అంగీకరించినట్లయింది.

కొత్త సచివాలయంలొకి వెళ్ళిన తర్వాత కొత్త స్కీమ్‌ను ప్రకటించి దానిపైన సంతకం చేస్తారని చాలామంది భావించారు. మొత్తం ఆరు ఫైళ్ళపై సంతకం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అందులో పోడు భూములను సాగుచేస్తున్న ఆదివాసీ రైతులకు హక్కు పట్టాలను పంపిణీ చేసే ఫైల్ కూడా ఉన్నట్లు తెలిపాయి. ఇది కూడా అసెంబ్లీ వేదికగా ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిందే. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలోనూ బీఆర్ఎస్ దీన్ని ఒక హామీగానే పేర్కొన్నది. గతంలో వివిధ సందర్భాల్లో హామీ ఇచ్చి ఇంతకాలం అమలు చేయకుండా ఉన్న పెండింగ్ అంశాలకు సంబంధించిన పైళ్ళపైనే కేసీఆర్ సంతకం చేయడం సచివాలయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మిగిలిన శాఖల మంత్రుల సంతకాలు కూడా అలాంటి స్కీమ్‌లూ, రోజువారీ యాక్టివిటీస్‌కు సంబంధించిన ఫైళ్ళే.

కొత్త సీసాలో పాత సారా ...

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై విపక్ష నేతలు, విద్యార్థులు, యువత పెదవి విరిచినట్లుగానే మంత్రులు సంతకాలు చేసిన పైళ్ళపైనా సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆయా శాఖల మంత్రులు సంతకాలు చేసిన ఫైళ్ళన్నీ వారు ఎప్పుడో చేయాల్సిన పనులేనని, కొత్త సచివాలయంలోకి అడుగు పెట్టిన తర్వాత వాటికి మోక్షం కలిగే తీరులో వ్యవహరించారని విపక్ష నేతలు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకు కొత్త సచివాలయంలో సంతకాలు చేసిన వ్యవహారం కొత్త సీసాలో పాత సారా తరహా చందంగా ఉందని ఎద్దేవా చేశారు. కొత్త పోలీసు స్టేషన్ల మంజూరు, మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో జోన్లను క్రియేట్ చేయడం, రోడ్లు-భవనాల శాఖ పునర్ వ్యవస్థీకరణతో కొత్త పోస్టుల మంజూరు.. ఇవన్నీ మంత్రులు వారి బాధ్యతగా చేయాల్సిన పనులేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని డిస్కంలకు ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడంతో నష్టాల్లో కూరుకుపోతున్నాయని విమర్శలు వస్తున్న సమయంలో ఆ నిధులను విడుదల చేసే ఫైల్‌పై విద్యుత్ మంత్రి జగదీష్‌రెడ్డి సంతకం చేశారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున రూ. 151.64 కోట్ల మేర నష్టపరిహారం విడుదల చేసే ఉత్తర్వులపై మంత్రి హరీశ్‌రావు సంతకం చేశారు. నిజానికి గత నెలలో కురిసిన అకాల వర్షాలతోనే 2.28 లక్షల ఎకరాల్లో రైతులకు పంట నష్టం వాటిల్లిందని, ఎకరానికి రూ. 10 వేల చొప్పున మొత్తం రూ. 228 కోట్లను విడుదల చేస్తామని సీఎం మార్చి చివరి వారంలోనే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆర్థిక మంత్రి కేవలం రూ. 151 కోట్లనే విడుదల చేశారు. ఇక టీచింగ్ ఆస్పత్రుల్లో 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ ఫైల్‌పై సంతకం చేశారు.

అబ్బురపడే పథకంపై అంచనాలు..

సెకండ్ టర్ములో ఫస్ట్ టైమ్ సచివాలయానికి వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన పథకాన్ని ప్రకటిస్తారని ప్రజలు భావించారు. దేశమే అబ్బురపడే పథకం ఒకటుందని, దాన్ని బైటపెడితే విపక్షాలు ఉక్కిరిబిక్కిరవుతాయని, ఇంటికి వెళ్ళిపోవాల్సిందేనని నాలుగేళ్ళ కిందటే వ్యాఖ్యానించారు. ఇలాంటి పథకాన్ని కొత్త సచివాలయం వేదికగా ప్రకటిస్తారని చాలా మంది అంచనా వేశారు. కానీ అలాంటిదేదీ ప్రకటించకపోవడంతో ఎన్నికల వరకూ వెయిట్ చేయాల్సిందేనేమో అనే ఆలోచనలో పడ్డారు. సీఎం మొదలు మంత్రులంతా సంతకాలు చేసిన ఫైళ్లలో కొత్తదనమేదీ లేకపోవడంతో నిరుత్సాహపడ్డారు. అధికారులను ఉద్దేశించి చేసే ప్రసంగంలో ప్రజలకు మెసేజ్ ఉంటుందని గులాబీ నేతలు కూడా ఆశలు పెట్టుకున్నారు. అవి కూడా సచివాలయం ప్రారంభోత్సవం రోజున ఫలించలేదు.

Tags:    

Similar News