Joinings: బీఆర్ఎస్, బీజేపీలకు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే
బీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ బిగ్ షాక్ ఇచ్చింది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరోసారి చేరికల రాజకీయం ఆసక్తిని రేపుతున్నది. త్వరలోనే మా పార్టీలోకి చేరికలు ఉంటాయని హింట్ ఇస్తున్న కాంగ్రెస్ (Congress) పార్టీ తాజాగా మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుంది. బీజేపీ నేత, ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు(Soyam Bapurao), బీఆర్ఎస్ నేత, కుమురం భీమ్ ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు (Atram Sakku) గురువారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి గాంధీ భవన్ లో టీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఎల్లుండి రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP NADDA) పర్యటించబోతున్న వేళ అంతకు ముందే పార్టీ మాజీ ఎంపీ కండువా మార్చడం హాట్ టాపిక్ గా మారింది.
ఇరువురు ఘర్ వాపసీ:
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోయం బాపురావు ఆ తర్వాత బీజేపీ (BJP) గూటికి చేరారు. ఆత్రం సక్కు బీఆర్ఎస్ (BRS) తో జతకలిశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ నియోరజకవర్గం నుంచి పోటీ చేసిన సోయం బాపురావు ఓటమి పాలవగా ఎంపీగా పోటీ చేసేందుకు అధిష్టానం అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన మాజీ ప్రజాప్రతినిధిగా మారిపోయారు. ఇక ఆత్రం సక్కుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్ నిరాకరించగా లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి బరిలోకి దింపింది. కానీ ఆయన మూడో స్థానానికే పరిమితం అయ్యారు. ఈ ఇరువురు నేతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తమ సొంత పార్టీల్లోనే అసంతృప్తితో రగిలిపోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వీరిరువురు గతంలో వదిలి వెళ్లిన కాంగ్రెస్ గూటికే తిరిగి చేరారు.
ఊ ఈజ్ నెక్స్ట్?:
రాష్ట్రంలోని కీలకమైన రెండు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ కు చేరడంతో తర్వాత హస్తం గూటికి చేరబోయేది ఎవరు అనేది చర్చగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే చేరికలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీలోని నేతలు హింట్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సోయం బాపురావు, ఆత్రం సక్కు కాంగ్రెస్ లో చేరడం ఆసక్తిని రేపుతున్నది.