బ్రేకింగ్: ఎన్నికలకు దూరంగా YSRTP.. తెలంగాణ పాలిటిక్స్‌లో మరో సంచలన పరిణామం
ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జనసమితి పార్టీ మద్దతు తెలపగా..
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జనసమితి పార్టీ మద్దతు తెలపగా.. తాజాగా కాంగ్రెస్‌తో మరో పార్టీ చేయి కలిపింది. ఈ నెల చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ఇవాళ సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌పై వ్యతిరేకత ఉన్నదని అన్నారు. కానీ వ్యతిరేక ఓటు చీలితే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యం కావున.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామన్నారు.
వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని.. రాష్ట్రంలో తమ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి అడ్డుపడొద్దని కాంగ్రెస్ పార్టీ కోరిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్టీపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలని ఈ సందర్భంగా షర్మిల తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా, వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని షర్మిల ప్రయత్నం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సైతం చర్చలు జరిపారు.
కానీ, తెలంగాణ కాంగ్రెస్ లోని ఓ వర్గం షర్మిల రాకను తీవ్రంగా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనానికి బ్రేక్ పడింది. ఈ పరిణామంతో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని షర్మిల ప్రకటించారు. కానీ అనూహ్యంగా షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ.. ఎన్నికలకు దూరంగా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పోస్ట్ ఇస్తామన్న హామీతోనే షర్మిల కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.