తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలన పరిణామం.. BRS గూటికీ మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..?

గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్ తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం

Update: 2024-07-30 11:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్ తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఇటీవల గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణమోహన్ రెడ్డి కొన్ని రోజుల్లోనే మనసు మార్చుకున్నారు. ఇవాళ కాంగ్రెస్‌కు కటిఫ్ చెప్పి తిరిగి సొంత గూటికీ చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బండ్ల తిరిగి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బండ్ల ఎపిసోడ్‌తో స్టేట్ పాలిటిక్స్‌లో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. అధికార కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు కౌంటర్‌గా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఘర్ వాపసీకి తెరలేపినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గులాబీ గూటికీ తిరిగి వచ్చారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ మొదలైంది.

బండ్ల బాటలోనే మరో ముగ్గురు..!

రాష్ట్రంలో గులాబీ పార్టీ పవర్ కోల్పోవడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో పూర్ ఫెర్మామెన్స్ ప్రదర్శించడంతో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇందులో ఒకరే. తాజాగా బండ్ల మనసు మార్చుకుని మళ్లీ సొంత గూటికీ చేరుకోవడంతో.. బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బండ్ల దారిలోనే వచ్చేందుకు సిద్ధమైనట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్‌తో బంధం తెంచుకుని బయటకు వెళ్లిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, చెవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మంత్రి పొంగులేటి అనుచరుడు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తిరిగి సొంత గూటికి రావాలని డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇవాల ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డితో భేటీ అయినట్లు జరుగుతోన్న ప్రచారం బీఆర్ఎస్ ఘర్ వాపసీ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కాలే యాదయ్య కూడా తిరిగి సొంత గూటికీ వస్తారని బీఆర్ఎస్‌లోని అగ్ర నేతలు బలంగా చెబుతుండటంతో తెలంగాణ పాలిటిక్స్ ముందు ముందు మరింత రసవత్తరంగా మారే సిట్యూవేషన్స్ కనిపిస్తున్నాయి.

దానంతో స్టార్ట్.. గూడెంతో స్టాప్

బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేల వలసల ప్రవాహం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో మొదలైంది. ఫస్ట్ బీఆర్ఎస్‌ను వీడి అధికారం పార్టీలో చేరింది ఎమ్మెల్యే దానం నాగేందరే. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్‌తో బీఆర్ఎస్‌లో వలసల ప్రవాహం కొనసాగింది. ఒకరి వెంట ఒకరు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరి కేసీఆర్‌కు వరుస షాకులు ఇచ్చారు. దానం తర్వాత ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం, పోచారం, సంజయ్, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, బండ్ల, గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్‌కు టాటా చెప్పి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కేసీఆర్ అత్యంత ఆప్తులుగా పేరున్న కడియం శ్రీహరి, పోచారం పార్టీ మారడం గులాబీ పార్టీలో పెద్ద గుబులే రేపింది. అయితే, కాంగ్రెస్‌పై ఆరు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని, ఆరు గ్యారెంటీల అమలులో జాప్యం రేవంత్ రెడ్డి సర్కార్‌పై ఎఫెక్ట్ చూపించిందని పొలిటికల్ కారిడార్స్‌లో చర్చ జరగడంతో పాటు పార్టీలో చేరే ముందు ఇచ్చిన ప్రియారిటీ ఆ తర్వాత దక్కడం లేదని వాపోతున్న జంపింగ్ లీడర్స్ తిరిగి గులాబీ గూటికీ రావాలని ప్రయత్నాలు షూరు చేసినట్లు టాక్. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్‌కు కౌంటర్‌గా బీఆర్ఎస్ తెరలేపిన ఘర్ వాపసీలో భాగంగా అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికీ వస్తారా లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News