Revanth Reddy:రేవంత్ రెడ్డికి మరో షాక్.. టీ-కాంగ్రెస్ సీనియర్ నేతల సంచలన నిర్ణయం
వర్గ విభేదాలు, అధిపత్య పోరుతో సతమతమవుతోన్న తెలంగాణలో కాంగ్రెస్‌లో ఇటీవల ఏఐసీసీ ప్రకటించిన నూతన కమిటీలు మరించి చిచ్చురేపాయి.
దిశ, వెబ్‌డెస్క్: వర్గ విభేదాలు, అధిపత్య పోరుతో సతమతమవుతోన్న తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల ఏఐసీసీ ప్రకటించిన నూతన కమిటీలు మరింత చిచ్చురేపాయి. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్లు.. టీపీసీసీ నూతన కమిటీలపై మరింత ఆగ్రహాంతో రగిలిపోతున్నారు. నూతన కమిటీల్లో కాంగ్రెస్ సీనియర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని.. మొదటి నుండి పార్టీలో ఉన్నవారికి కమిటీల్లో మొండి చేయి చూపారని మండిపడుతున్నారు. సీనియర్లను సంప్రదించకుండా ఏకపక్షంగా నూతన కమిటీలు వేశారని.. కమిటీల్లో ఒక వర్గం వారికే అధిక ప్రాధాన్యత ఇచ్చారని సీనియర్లు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం సీఎల్పీ నేత భట్టి నివాసంలో సీనియర్లంతా సమావేశమయ్యారు. ఈ భేటీలో సీనియర్ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ చీఫ్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఈ భేటీలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ నూతన కమిటీల అంశం కొలిక్కివచ్చే వరకు పీసీసీ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించారు. రేపటి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలకు సైతం దూరంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాగా, రేపు టీపీసీసీ కార్యవర్గం సమావేశమై.. ఏఐసీసీ కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈ తరుణంలో పీసీసీ సమావేశానికి హాజరు కాకుడదని సీనియర్లు తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది.
అయితే, రేవంత్ వ్యవహారం నచ్చక గత కొద్ది కాలంగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో పాటు మరి కొందరు సీనియర్ నేతలు రేవంత్‌తో దూరం పెంచుకోవడంతో పాటు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం టీ- కాంగ్రెస్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బిగ్ న్యూస్.. రెండుగా చీలిన టీ కాంగ్రెస్! వాట్ నెక్స్ట్?
కాంగ్రెస్ సీనియర్ల కొత్త నినాదం.. రేవంత్ రెడ్డికి మరో బిగ్ షాక్!