ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల కోసం కలెక్టరేట్ల ముట్టడి

ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల విడుదల కోసం విద్యార్థులు నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తతల మధ్య సాగింది.

Update: 2024-10-22 11:57 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల విడుదల కోసం విద్యార్థులు నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తతల మధ్య సాగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.7,500 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలన్న డిమాండ్ తో బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్. కృష్ణయ్య పిలుపుమేరకు విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ లను ముట్టడించి, ఆయా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందించారు. అయితే భారీ ర్యాలీలలో వేలాదిగా తరలివచ్చిన విద్యార్థుల కలెక్టరేట్ లలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు బారికేడ్లు, ముళ్ళకంచెలతో వారిని నిలువరించారు.

ఈ సందర్భంగా పలు జిల్లాల కలెక్టరేట్ ల వద్ద విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాటలతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నల్లగొండలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్, యాదాద్రి భువనగిరిలో బీసీ విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించారు. 


Similar News