అది పూర్తిగా రేవంత్ సర్కారు వైఫల్యమే.. మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్
ప్రభుత్వ(Congress Government) తీరు పట్ల మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ(Congress Government) తీరు పట్ల మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 322 సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. ఆచరణలో ఇప్పటి వరకు ఒక్క రైతు దగ్గర కూడా పత్తి కొనుగోలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్(Warangal Rythu Declaration) ప్రకారం, పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7521తో పాటు, రూ.500 బోనస్ కలిపి రూ. 8021 కొనుగోలు చేయాల్సింది. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు 5వేలకే అమ్ముకునే దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. అకాల వర్షాల వల్ల దిగుబడి తగ్గిపోయి ఎకరానికి నాలుగు క్వింటాళ్ల పత్తి కూడా పండలేదని.. గోరు చుట్టు మీద రోకటి పోటులా దిగుబడి తగ్గడంతో పాటు తక్కువ ధరకు అమ్ముకొని పత్తి రైతులు దారుణంగా నష్టపోతున్నారంటే ఇది పూర్తిగా రేవంత్ సర్కారు వైఫల్యమే అని తెలిపారు.
వరి కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు రాలేదు. ఏ ఊరు ధాన్యం ఏ మిల్లుకు పోవాలో ఒప్పందం జరగలేదు. ధాన్యం రవాణా ఏర్పాట్లకు కూడా దిక్కులేదు. ప్రభుత్వం కట్టాలని చెప్పిన ఎర్ర రంగు సుతిలి దారం గానీ, పచ్చ రంగు సుతిలి దారం గానీ కొనుగోలు కేంద్రాలకు చేరిన దాఖలాలు లేవు. వరి పండించిన రైతుల పరిస్థితి ఎట్లుందంటే, అంగట్లో అవ్వ అంటే ఎవనికి పెట్టినవ్ బిడ్డా అన్నట్లుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని మాయ మాటలు చెప్పి గద్దెనక్కిన తర్వాత సన్న రకాలకు మాత్రమే ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కారని విమర్శించారు. ఇప్పుడు అటు సన్నాలకు, ఇటు దొడ్డు రకాలకు బోనస్ మాట అంటుంచి మద్దతు ధర కూడా లభించని దౌర్భాగ్య స్థితిలోకి రైతులను నెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా సన్నబియ్యం పట్టుమని పది కిలోలు కొన్న దాఖలాలు లేవు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రంధి లేకుండా బతికిన రైతులను పది నెలల కాలంలో చేసిన కష్టానికి ఫలితం దక్కక అలమటించేలా చేశారని అన్నారు. కేసీఆర్ పాలనలో దుక్కి దున్నినప్పటి నుంచి పంట కొనుగోలు దాకా కంటికి రెప్పలాగా రైతులను కాపాడుకుంటే, కాంగ్రెస్ పాలన రాజకీయ విష క్రీడలో, తిట్ల పురాణాల్లో మునిగి తేలుతుంటే రైతులు దిక్కులేని పక్షులై దీనంగా చూస్తున్నారని ఆవేదన చెందారు. హైడ్రాలు, మూసీలు, ఫోర్త్ సిటీ డంభాచారాలను కొంచెం పక్కనపెట్టి పంట కొనుగోలు మీద, మద్ధతు ధర మీద, ఇస్తామన్న బోనస్ మీద దృష్టి కేంద్రీకరించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు సరిగా చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.