ముందు నీ పార్టీని కాపాడుకో రామారావు.. కేటీఆర్ పర్యటనపై తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్
కేటీఆర్ ముందుగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేసుకోవాలని, చివరి దశలో ఉన్న ఆయన పార్టీని కాపాడుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్ (KTR) ముందుగా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) బలోపేతం చేసుకోవాలని, చివరి దశలో ఉన్న ఆయన పార్టీని కాపాడుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) ట్వీట్ చేసింది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ (BRS Silver Jublee) సందర్భంగా కేటీఆర్ జిల్లాల పర్యటన చేయనున్నారని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. పర్యటనలో భాగంగా కేటీఆర్ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారని, దీనికి సంబంధించిన షెడ్యూల్ ని కూడా పోస్ట్ చేసింది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ స్పందిస్తూ.. కేటీఆర్ పర్యటనపై కౌంటర్ ఇచ్చింది. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ పార్టీ నేతలు (BRS Leaders) అసెంబ్లీలోనూ నిలబడలేని పరిస్థితి వచ్చిందంటే ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్మాలి అని ప్రశ్నించింది.
అలాగే సిల్వర్ జూబ్లీ కాదు.. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన పార్టీ చివరి దశకి చేరుకుంటోందని, ముందు మీ పార్టీని కాపాడుకోండి అని సలహా ఇచ్చింది. అంతేగాక తెలంగాణ ప్రజలు మీ పర్యటనలకు కాక, కొత్త ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న పనులకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపింది. ప్రగతి ప్రస్థానం అంటున్నారని, అసలు మీ 10 ఏళ్ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయా?, రైతులు అప్పులపాలయ్యారు తప్ప అని విమర్శలు చేసింది. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కలలు కనడం మానండి.. ప్రజలు మీకు గుణపాఠం నేర్పారు, అర్థం చేసుకోండి అని పేర్కొంది. ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు, మీ 10 ఏళ్ల పాలనకే ఉందని, అందుకే మీ పార్టీని ఓడించేశారని తెలిపింది.
మీ ప్రభుత్వం అమలు చేయని హామీల గురించి ఓసారి గుర్తుచేసుకోండి.. ఫార్మాసిటీ, ప్రాజెక్టులు, ఉద్యోగ నోటిఫికేషన్ల సంగతేంటి అని నిలదీశింది. ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకని, మీ నియంతృత్వ పాలన కారణంగా ప్రజలు మీతో సంబంధం తెంచుకున్నారని వ్యాఖ్యానించింది. ఇక ఇది పార్టీని బలోపేతం చేసే పర్యటన కాదని, కేటీఆర్ భవిష్యత్తు రాజకీయాలను కాపాడుకునే పర్యటన అని ఎద్దేవా చేసింది. ప్రజల భరోసా మాపైనే అంటున్నారని, మరి 10 ఏళ్లు పాలించిన మిమ్మల్ని ఎందుకు ప్రజలు గద్దె దించారో చెప్పాలని అన్నది. కేసీఆర్ అనే నేత ప్రజల్లోకి రావడానికే భయపడుతున్నాడని, అసెంబ్లీకి వచ్చే ధైర్యం కూడా లేకుండా పోయిందని, ఇంకా సీఎం అయితడు అని పగటి కళలు కనడం మానేయండి అని కాంగ్రెస్ రాసుకొచ్చింది.