ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌‌న్యూస్.. రెండేళ్ల తర్వాత ఇదే ఫస్ట్‌ టైం!

ప్రభుత్వోద్యోగులకు రెండేండ్ల తర్వాత నెల మొదటి వారంలో జీతాలు జమ అవుతున్నాయి. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో జీతాలు ఆలస్యం చేస్తే ఉద్యోగ వర్గాల నుంచి నిరసన ఎదురవుతుందని భావించిన సర్కారు..

Update: 2022-10-01 07:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వోద్యోగులకు రెండేండ్ల తర్వాత నెల మొదటి వారంలో జీతాలు జమ అవుతున్నాయి. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో జీతాలు ఆలస్యం చేస్తే ఉద్యోగ వర్గాల నుంచి నిరసన ఎదురవుతుందని భావించిన సర్కారు.. ఒక్కో ఎస్టీఓ ఒక్కో జిల్లా, ఒక్కో శాఖ, ఇలా శాలరీ క్రెడిట్ చేస్తోంది. శుక్రవారం నుంచే జీతాల పంపిణీ ప్రక్రియ మొదలుపెట్టింది. హెచ్ఓడీ విభాగాలకు అల్రెడీ జీతాలు జమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు ఆలస్యమవుతున్న విషయం తెలిసిందే. ప్రతినెలా 18వ తేదీ వరకు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలు, ఎస్టీఓల వారీగా విభజించి సాలరీ ఇస్తున్నారు. అయితే, ప్రస్తుతం మొదటి వారంలోనే తెలంగాణలో అతిపెద్ద రెండు పండుగలు ఉండటంతో వేతనాల కోసం సర్కారుపై ఒత్తిడి మొదలైంది. ఆర్థిక శాఖ కూడా వేతనాల ఫైల్‌ను ముందుగానే సిద్ధం చేసింది.

దీంతో అందుబాటులో ఉన్న నిధుల మేరకు జిల్లాలకు జీతాలు ఇస్తున్నారు. శుక్రవారం హెచ్ఓడీ విభాగాలకు క్లియర్ చేశారు. ప్రధానంగా పోలీసుశాఖతో పాటుగా కొన్ని విభాగాలకు ముందుగా రిలీజ్ చేశారు. గత నెల 30న పోలీస్ శాఖతో పాటుగా హెచ్ఓడీ విభాగాలకు విడుదల చేశారు. ఆ తర్వాత శనివారం ఉదయం నుంచే కొన్ని జిల్లాల ఉద్యోగులకు జీతాలు జమ అయినట్లు మెసేజ్ వస్తోంది. మహబూబ్‌నగర్, కామారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల ఉద్యోగులకు శనివారం ఉదయం వారి అకౌంట్లలో సాలరీ క్రెడిట్ అయింది. ఇవాళ సాయంత్రం వరకు ఇంకా కొన్ని జిల్లాలకు ఇవ్వనున్నారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆలస్యం

కాగా, కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల బిల్లులు ఇంకా పెండింగ్ పెట్టారు. కొన్ని శాఖల్లో మాత్రం నిర్వహణ బిల్లులు ఉంటే వాటి నుంచి జీతాలు చెల్లించాలని సూచించారు. కానీ, మెజార్టీ శాఖల్లోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ఈ నెల 6 వరకు జీతాలు వస్తాయని ముందుగానే సమాచారమిస్తున్నారు.

Also Read: పండుగ వేళ తెలంగాణ సర్కార్ మరో శుభవార్త 

Tags:    

Similar News