అసెంబ్లీలో సబిత కన్నీరు.. సీఎం రేవంత్‌పై కొడుకు కార్తీక్ సంచలన ట్వీట్

అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-31 15:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆవేదన చెందారు. సీనియర్ ఎమ్మెల్యేను అని కూడా చూడకుండా మాట్లాడారని భావోద్వేగానికి లోనయ్యారు. తాజాగా ఈ పరిణామంపై సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా ఓ పోస్టు పెట్టారు.

‘‘సరే రేవంత్ అన్న.. 2019 సంవత్సరంలో మేము నిన్ను వదిలి పార్టీ మారాము అనేది మీ బాధ అయితే? ఆరోజు మీ కనుల ముందు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు మిమ్మల్ని మేము పార్టీలోకి తీసుకొచ్చాం అని అక్కసుతో నన్ను, మా అమ్మని నానా ఇబ్బందులు పెడుతున్నప్పుడు, వాళ్ళు నన్ను, మా కుటుంబాన్ని రాజాకీయ సమాధి చేయాలి అని ప్రయత్నం చేసినప్పుడు మీరు ఎక్కడికి పోయారు అన్నా? అందరికీ నోరారా 'మా అన్న రేవంత్ అన్న' అని చెప్పుకున్న నన్ను, నాకు అవసరం ఉన్నప్పుడు ఒక అండగా ఉండాల్సిన సమయంలో నన్ను అనాధగా వదిలి వెళ్ళింది మీరు కాదా అన్నా? 2018 సంవత్సరంలో నా రాజకీయ భవిష్యత్ కోసం ఒక మాట సహాయం చేయండి అన్నా అని వేడుకుంటే, "నా చేతిలో ఏమి ఉంది" అని చెప్పి నాగుండెకు మానలేని గాయం చేసింది మీరు కాదా అన్నా? పార్టీలు మారినా ఎప్పుడూ మీరూ మరియు వదినమ్మ బాగుండాలి అని కోరుకున్న వాళ్ళము మేము, మీ నాశనము ఎప్పుడు కోరుకోలేదు మేము. బాధ అనేది మీకు ఎంత కలిగిందో దానికి రెట్టింపు బాధ నాకు కలిగింది అన్న. ఎవరికి ఎవరు మోసం చేశారు, ఎవరి వల్ల ఎవరికి లాభం జరిగింది అనేది ఆ దేవుడికి తెలుసు అన్న’’ అని ట్వట్టర్‌లో కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News