చెరువులు, లే‌అవుట్లకు రైతుబంధు..! మేడ్చల్ జిల్లాలో జోరుగా అక్రమాలు

రైతుబంధు పక్కదారి పడుతోంది.

Update: 2024-07-17 02:13 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో/శామీర్‌పేట: రైతుబంధు పక్కదారి పడుతోంది. సాగు యోగ్యమైన భూములకే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నా..వాటిని తోసి రాజనీ వక్ఫ్, దేవాలయ భూములు, చెరువులు, గుట్టలు, లే అవుట్లకు సైతం రైతుబంధు అందుతోంది. ఇలా రూ.కోట్లలో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతోంది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం పోచారం గ్రామానికి చెందిన యాదగిరిరెడ్డి అనే వ్యక్తి నుంచి అక్రమంగా పొందిన రూ.16 లక్షల రైతు బంధును తిరిగి చేల్లించాలని నోటీసులు జారీ చేసిన విషయం విధితమే. అయితే తాజాగా శామీర్‌పేటలో మరో రైతుబంధు మోసం వెలుగులోకి వచ్చింది. రైతుబంధు లక్ష్యం నీరుగారుతూ అక్రమాల పాలవుతున్న తీరుపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

పంచాయతీ లేఅవుట్‌కు రైతుబంధు..

శామీర్‌పేట గ్రామ రెవెన్యూ పరిధిలోని సెలబ్రిటీ రిసార్ట్స్ పక్కన సర్వే నంబర్లు 1211, 1213, 1214, 1215, 1216, 1217 లలో 11 ఎకరాల 26 గుంటల వ్యవసాయ పట్టా భూమి ఉండేది. కాగా 2003లో జయ ఈశ్వర్ రెడ్డి, మహేశ్‌రెడ్డి, రాజ వెంకటరెడ్డిలు రైతుల వద్ద భూములు కొనుగోలు చేసి, ప్రైవేట్ డెవలపర్‌ల సాయంతో గ్రామపంచాయతీ నుంచి లేఅవుట్ అనుమతి పొందారు. లే అవుట్‌కు కావాల్సిన అనుమతులు లేకుండానే ప్రక్రియ పూర్తి చేశారు. అనంతరం ప్లాట్లను అనేక మందికి విక్రయించారు. ఇలా వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదిస్తూనే వ్యవసాయేతర భూమికి తప్పుడు పత్రాలు సమర్పించి ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో రైతుబంధు పొందారు. 2021 నుంచి 2024 వరకు మూడేళ్ల పాటు రూ.1,61,375లు తీసుకున్నారు. దీంతో అక్రమంగా పొందిన పాస్ బుక్‌లను రద్దు చేయడంతో పాటు రైతుబంధు సొమ్మును ప్రభుత్వం రికవరీ చేయాలని రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

భారీగా అవకతవకలు..

మేడ్చల్ జిల్లాలో 28,162 ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగు చేస్తున్నట్లు ప్రభుత్వ రికార్డులు తెలుపున్నాయి. అయితే ఏటా ప్రతి సిజన్‌లో పంట పెట్టుబడి సాయం కింద 66,519 ఎకరాలకు రూ.39.92 కోట్ల రైతుబంధు నిధులు విడుదల అవుతున్నాయి. పాస్ బుక్‌లు, ఆధార్ కార్డు అనుసంధానం ఆధారంగా రూ.33.25 కోట్లు సంబంధిత రైతు ఖాతాల్లోకి ప్రభుత్వం రైతుబంధును జమ చేస్తోంది. అంటే ఈ లెక్కన 38,357 ఎకరాల వ్యవసాయేతర భూములకు ప్రభుత్వం రైతుబంధు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.


Similar News