ఆర్టీసీ సొంత బ్రాండ్ 'జీవా' వాట‌ర్.. బాటిల్స్ మార్కెట్లోకి విడుద‌ల‌

టీఎస్‌ ఆర్టీసీ సొంత బ్రాండ్‌ జీవా వాట‌ర్ బాటిళ్లను సోమ‌వారం మార్కెట్లోకి విడుద‌ల చేసింది.

Update: 2023-01-09 15:47 GMT

దిశ, ముషీరాబాద్: టీఎస్‌ ఆర్టీసీ సొంత బ్రాండ్‌ జీవా వాట‌ర్ బాటిళ్లను సోమ‌వారం మార్కెట్లోకి విడుద‌ల చేసింది. టీఎస్‌ ఆర్టీసీ టికెటేత‌ర‌ ఆదాయాన్ని పెంచుకోవాలనే ఆలోచ‌న‌తో ముంద‌డుగు వేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ అన్నారు. టీఎస్‌ ఆర్టీసీ ప్రజల ఆస్తి అని, పేద, మధ్య తరగతి వాళ్లు వినియోగించే ఈ సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ప్రైవేట్‌ పరం చేయబోదని స్పష్టం చేశారు. హైద‌రాబాద్‌లోని మ‌హాత్మాగాంధీ బ‌స్ స్టేష‌న్ లో జ‌రిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ధన్, టీఆర్ అండ్ బీ కార్యదర్శి కేఎస్‌. శ్రీనివాస రాజు ఐఎఎస్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్​తో క‌లిసి లాంఛ‌నంగా ప్రారంభించిన అనంత‌రం నీటిని రుచి చూశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రతీ ఏటా టీఎస్ ఆర్టీసీ 90 లక్షల లీటర్ల వాట‌ర్ బాటిళ్లను బయట నుంచి కొని వినియోగించ‌డం జ‌రుగుతోంద‌ని, ఇకపై ఆ ప‌రిస్థితి ఉండ‌దని, సొంతంగా జీవా వాట‌ర్ బాటిళ్లనే వాడ‌నున్నట్లు తెలిపారు.

టీఎస్‌ ఆర్టీసీలో దాదాపు 50 వేల మందిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా టీఎస్‌ఆర్టీసీ ఆదాయం పెంచుకోవాలని భావిస్తోందని చెప్పారు. సంస్థ ఎండీగా సజ్జనర్ బాధ్యతలు స్వీక‌రించిన తరువాత‌ 20 నుంచి 25డిపోలను లాభాల బాటలోకి తీసుకురావ‌డం అభినంద‌నీయమంటూ రాబోయే రోజుల్లో అన్ని డిపోలు లాభాల్లోకి వస్తాయని ఆయ‌న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీఎస్‌ఆర్టీసీకి టికెట్‌ ద్వారా వచ్చే ఆదాయమే ప్రధానమని గుర్తు చేస్తూ, టికెటేతర ఆదాయంపై కూడా దృష్టి పెట్టడం జ‌రిగింద‌న్నారు. ప్రతి రోజు 9 వేల బస్సులు 33 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 30 లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతోందని వివ‌రించారు.

సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ  టీఎస్‌ఆర్టీసీకి 96 శాతం రెవెన్యూ టికెట్ల ద్వారానే వస్తోందని, గతంలో కన్నా ఆక్యూపెన్సీ రేటు ఇప్పడు పెరిగిందన్నారు. అయినా ఇంకా సాధించాల్సి ఉందని, అందుకే ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్తున్నామన్నారు. అందులో భాగంగానే కార్గో సర్వీసెస్‌, పెట్రోల్‌ బంక్‌ల ఏర్పాటు చేశామని, కార్గో సేవల ద్వారా మూడేళ్లలో రూ.200 కోట్ల రాబడి వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు ముని శేఖర్, పురుషోత్తం, యాదగిరి, వినోద్‌కుమార్, జీవన్‌ ప్రసాద్‌, రేగుల సునీల్, రంగారెడ్డి, హైదరాబాద్ ఆర్‌ఎంలు శ్రీధర్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Similar News