Bhatti: రుణమాఫీ పథకానికి స్ఫూర్తి ప్రదాత మన్మోహన్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Update: 2024-12-30 16:29 GMT
Bhatti: రుణమాఫీ పథకానికి స్ఫూర్తి ప్రదాత మన్మోహన్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని, నేడు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ పథకానికి స్ఫూర్తి ప్రదాత మన్మోహన్ సింగ్ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) పేర్కొన్నారు. అసెంబ్లీ(Telangana Assembly)లో సోమవారం దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) సంతాప తీర్మానంను పురస్కరించుకొని మాట్లాడారు. భూమిపై ఎలా వస్తారో... అలా మాయమై పోతారు.. కొందరు మాత్రమే ఈ భూమిపై మానవీయ పరిమళాలు వెదజల్లుతారు.. అందులో దివంగత నేత మన్మోహన్ సింగ్ ఒకరు అని కొనియాడారు. తెలంగాణ ఉన్నంతకాలం మన్మోహన్ పేరు చిరస్థాయిగా ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో అవసరమైన బలం లేకున్నా ప్రతిపక్షాలను ఒప్పించి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ తెలంగాణ బిల్లును ఆమోదింప చేశారన్నారు.

హైదరాబాదులో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు, ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మన్మోహన్ సింగ్ ప్రతి పదవికి వన్నె తెచ్చారని, ప్రతి బాధ్యతలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. దేశ ఆర్థిక పరిస్థితులే కాదు సామాజిక పరిస్థితులు అర్థం చేసుకొని అనేక చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ దే అన్నారు. సామాన్యుడు సమాచారాన్ని తెలుసుకునే సమాచార హక్కు చట్టాన్ని 2005లో తీసుకువచ్చారని, దేశగతినే మార్చిన ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఆయన తీసుకువచ్చారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు ఏర్పడగా... ఈ చట్టం ద్వారా దేశ ప్రజలు ఆర్థిక మాధ్యం బారిన పడకుండా కాపాడగలిగారన్నారు. ఆత్మగౌరవం లేకుండా అడవుల్లో పలికే వారి కోసం అటవీ హక్కు చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. భూ సేకరణ చట్టం తీసుకువచ్చి దేశంలో ప్రగతిశీల వాదుల మన్ననలు పొందారని తెలిపారు. అమానవీయమైన స్కావెంజర్స్ చట్టాన్ని పూర్తిగా రద్దుచేసి.. వారికి భద్రత కల్పిస్తూ ప్రపంచంలో దేశంపై గౌరవం పెంచారన్నారు.

Tags:    

Similar News