ఆర్టీసీ కార్మికుల సంచలన నిర్ణయం.. సీఎం కేసీఆర్‌కు షాక్ ఇచ్చేలా పాదయాత్ర

రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, సమస్య పరిష్కారానికై మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య పాదయాత్రకు పిలుపునిచ్చింది.

Update: 2022-12-11 14:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, సమస్య పరిష్కారానికై మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య పాదయాత్రకు పిలుపునిచ్చింది. మునుగోడు బైపోల్ జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చలేదని కమిటీ మండిపడింది. ఆదివారం చౌటుప్పల్‌లోని ఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు బైపోల్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమాఖ్య నాయకులతో వివిధ దఫాలుగా చర్చలు జరిపారని, కొన్ని సమస్యలు పరిష్కారం చేశారని వివరించారు. ఎన్నికల కోడ్ అయిపోగానే ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచుతామని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సీఎం ప్రకటించారని, కాని అమలు చేయలేదని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పై అధికార మంత్రులకు ఎమ్మెల్యేలకు పలు మార్లు వినతులు చేశామని గుర్తుచేశారు. ప్రభుత్వం హామీ ఇవ్వడం ఆ తర్వాత జాప్యం చేస్తూ కాలయాపన చేస్తుందని, కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.

కార్మికుల సమస్యలు అమలు అయ్యేంత వరకు మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ నుంచి ఇందిరాపార్కు ధర్నా చౌక్ వరకు మౌన ప్రదర్శనతో పాదయాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 7 నుంచి పాదయాత్ర ప్రారంభించి 3 రోజులు కొనసాగించి జనవరి 9వ తేదీన ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ముగించాలని నిర్ణయించామన్నారు. ఆర్టీసీ లోని అన్ని కార్మిక సంఘాలకు మద్దతు కోరుతూ లెటర్ రాయాలని వివరించారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులు వీక్లీ ఆఫ్, స్పెషల్ ఆఫ్, ఇన్ కమింగ్ అయిన వారు పాల్గొనాలని రాజిరెడ్డి కోరారు. ఈ సమావేశంలో కన్వీనర్ ఎంవీ చారి, ముఖ్య సలహాదారు బీజేఎం రెడ్డి, సలహాదారు మారగోని అంజయ్య గౌడ్, వైస్ చైర్మన్ సుర్కంటి మోహన్ రెడ్డి, కో కన్వీనర్స్ యాదయ్య, ఎండీ మోసిన్, కె.దశరథ, పి.యాదయ్య, పి.సత్తయ్య. డి.విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News