భారీగా పెరిగిన బస్సు చార్జీలు అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
దీపావళి పండుగకు ఊర్లకు వెళ్లిన ప్రజలు ఆది, సోమవారాల్లో భారీగా తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ బస్సు టికెట్ ధరలను పెంచిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సంస్థ ప్రకటించింది. రెగ్యులర్ సర్వీస్‌లకు సాధారణ చార్జీలే అమల్లో ఉన్నాయని, దీపావళి తిరుగు ప్రయాణ రద్దీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారమే చార్జీలు సవరించామని సంస్థ వివరించింది. ప్రధాన పండుగులు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోందన్నారు. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ ఉండకపోవడంతో ఆ బస్సులు ఖాళీగా వెళ్తున్నాయని, ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని గుర్తు చేశారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.50 వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చిందని ఇది, గత 21 ఏళ్లుగా అనవాయితీగా వస్తోన్న ప్రక్రియగా వివరించింది.
దీపావళి పండుగ సమయంలో రెగ్యులర్ సర్వీసుల ద్వారానే ప్రయాణికులు సొంతుళ్లకు వెళ్లారని, కానీ తిరుగు ప్రయాణంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి రద్దీ ఎక్కువగా ఉన్నదని సంస్థ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఆది, సోమవారం న రద్దీకి అనుగుణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించిందన్నారు. ఆదివారం కరీంనగర్ రీజియన్ నుంచి 127, రంగారెడ్డి నుంచి 105, వరంగల్ నుంచి 66, ఆదిలాబాద్ నుంచి 16 మొత్తంగా 360 ప్రత్యేక బస్సులను హైదరాబాద్‌కు సంస్థ నడిపిందన్నారు. సోమవారం సాయంత్రం వరకు ఆయా ప్రాంతాలనుంచి మరో 147 సర్వీసులను ఏర్పాటు చేసిందన్నారు. ఈ స్పెషల్ బస్సుల్లో మాత్రమే జీవో ప్రకారం చార్జీలను సవరించామని, ఈ బస్సులు మినహా మిగతా బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉన్నాయని సంస్థ వివరించింది.