రాజకీయాలకంటే రహదారులే ముఖ్యం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాజకీయాలకంటే తమ ప్రభుత్వానికి రహదారుల నిర్మాణమే ముఖ్యమని రాష్ట్ర ఆర్&బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-08-21 16:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయాలకంటే తమ ప్రభుత్వానికి రహదారుల నిర్మాణమే ముఖ్యమని రాష్ట్ర ఆర్&బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... పలు జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణ స్థితిగతులపై సంభాషణలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన భూసేకరణ దాదాపు పూర్తయ్యిందని, మిగిలిన కాస్త భూసేకరణ వచ్చేనెల 15 నాటికి పూర్తి చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. ఆ వెంటనే టెండర్లకు నోటిఫికేషన్ వస్తుందని ఆయన చెప్పారు. తమకు తొలి ప్రాధాన్యం రహదారులను అభివృద్ధి చేయడమేనని ఆయన అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే రోడ్లను బాగు చేస్తే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని ఆయన తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టం లేకుండా నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. ఇక దక్షిణ భాగానికి సంబంధించి భూసేకరణను ప్రారంభించాలని అధికారులను ఆదేశించామని, భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా అలైన్ మెంట్ ఉండాలని అధికారులకు గౌరవ ముఖ్యమంత్రి గారు, తాను సూచించామని ఆయన తెలిపారు. భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇక నుంచి ఉత్తర, దక్షిణ భాగానికి సంబంధించిన ఆర్ఆర్ఆర్ పనులపై రోజువారీగా సమీక్ష చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్-విజయవాడ (ఎన్.హెచ్-65) రోడ్డు పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదం తెలిపిందని.. రెండు నెలల్లో టెండర్లు పిలిచి నవంబర్ నాటికి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అంతేకాదు, ఇప్పటికే మన్నెగూడ ఎక్స్ ప్రెస్ వే రోడ్డు పనులను ప్రారంభించామని తెలిపారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడర్ పనులను స్వయంగా ఆర్&బీ శాఖ అధికారులతో కలిసి పరిశీలించానన్నారు. సదరు కాంట్రాక్టును ఫోర్ క్లోజ్ చేసి కొత్తగా పనులు ప్రారంభించబోతున్నామని తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల్లో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలో కలిసి రాష్ట్రంలో నిర్మిస్తున్న అన్ని జాతీయ రహదారుల పనులను ముందుకు తీసుకుపోయేందుకు కావాల్సిన సహకారం గురించి వివరిస్తామని ఆయన తెలిపారు. అయితే, తమకు రాజకీయాలకన్నా ప్రజల జీవితాలను బాగుచేయడమే ప్రధానమని, తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తుందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలను పూర్తిగా అథఃపాతాలానికి దిగజార్చిందని మండిపడ్డ ఆయన, ప్రజల ఆకాంక్షల సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నామని చెప్పారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం చేసే మంచిపనులపై బురదజల్లి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రెండెళ్లలో రాష్ట్రంలో అద్భుతంగా జాతీయ రహదారులను, రాష్ట్ర రహదారుల నిర్మాణం చేసి ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు.


Similar News