ఉగాది నుంచి ఆడబిడ్డలకు సన్నబియ్యం : మంత్రి పొంగులేటి

ఉగాది నుంచి ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు

Update: 2025-03-20 11:44 GMT
ఉగాది నుంచి ఆడబిడ్డలకు సన్నబియ్యం : మంత్రి పొంగులేటి
  • whatsapp icon

దిశ,కల్లూరు : ఉగాది నుంచి ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పెనుబల్లి మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి రామచంద్రపురంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పలు ప్రైవేట్ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.... ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం 15 నెలలు పూర్తి చేసుకుందని తెలిపారు. ఈ వ్యవధిలో మహిళలకు ఉచిత బస్సు హామీ నెరవేర్చామని ఇందుకు గాను ఇప్పటి వరకు 5,450 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని పేర్కొన్నారు. రూ. 20,676కోట్ల రైతు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. ఏడాదిలోనే 56 వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు.

రూ. 500కే గ్యాస్ అందించిన ఘనత తమదేనన్నారు. తాజాగా మూడు రోజుల క్రితం రాజీవ్ యువ వికాస్ అనే పేరుతో నూతన పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా ఒక్కో నియోజక వర్గంలో సుమారు 4000 మందికి పైగా ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశం దొరుకుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 25 లక్షల ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ. 7 లక్షల కోట్లకు పైగా అప్పులకు ప్రతి నెల రూ. 6500 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నామని తెలిపారు. ఆ కారణంగానే కొన్ని హామీలను అమలు చేయడంలో జాప్యం జరుగుతుందని తెలిపారు. తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇళ్లు పేదలకు ఇవ్వడం లక్ష్యమని తెలిపారు.

తొలి విడతలో ఈ ఏడాది నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుబంధు ఇచ్చామని, సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ కూడా ఇచ్చామని తెలిపారు. ఇన్ని చేస్తున్నా ప్రతిపక్షాలు ఓర్వలేక తమ పై విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రామచంద్రపురంలో కొంతమంది రైతులు ఏళ్లుగా ప్రభుత్వ అటవీ భూమిని సాగుచేసుకుంటున్నారని వాటికి ప్రభుత్వం తరుపున చట్టబద్ధత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం టేకులపల్లి గ్రామంలో అవిరామ్ సర్వీస్ స్టేషన్ ను ప్రారంభించారు. స్థానికంగా ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం

కల్లూరు మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి ఎర్రబోయినపల్లి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ లకు శంకుస్థాపన చేశారు. పెద్దకోరుకొండి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ తో పాటు అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ I.A.S, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్, కల్లూరు AMC చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, సత్తుపల్లి నియోజకవర్గం 5 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, 5 మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, NSUI, మహిళా కాంగ్రెస్ నాయకులు, పెనుబల్లి మండలం కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News