నమస్తే మంత్రి గారు..! కాంగ్రెస్ ఎమ్మెల్యే ను పలకరించిన మాజీమంత్రి మల్లారెడ్డి
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా మంగళవారం సభకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (BRS MLA Chamakura MallaReddy) హాజరయ్యారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మల్లారెడ్డి.. అసెంబ్లీ సమావేశాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆనాడు పార్లమెంట్ లో వాజ్‌పేయి లాంటి వారు మాట్లాడుతుంటే దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసేవారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), రాజశేఖర్ రెడ్డి (YS Rajasheskar Reddy) లాంటి నాయకులు సభలో మాట్లాడుతుంటే ప్రజలు టీవీలకు హత్తుకొని పోయేవారని చెప్పారు.
అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అసెంబ్లీలో కేసీఆర్ (KCR) ఏం మాట్లాడతారని ఆసక్తి ఉండేదని, కానీ ఇవాళ అసెంబ్లీలో బట్టలు విప్పుడు, కత్తులు దూసుడే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. అనంతరం అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డికి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి (Chennuru MLA Vivek Venkataswamy) ఎదురుపడ్డారు. వీరద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. ఒకరిపై మరొకరు ఛలోక్తులు విసురుకున్నారు. వివేక్ వెంకటస్వామినీ నమస్తే మంత్రి గారు అని మల్లారెడ్డి పలకరించారు. దీనికి వివేక్ వెంకటస్వామి థాంక్స్ మల్లన్న అని పలకరించారు. అనంతరం మల్లారెడ్డి.. రాష్ట్రంలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఫ్యామిలీ, వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ లదే హవా నడుస్తుందన్నా అని అన్నారు. దీనికి ఆయన.. బీఆర్ఎస్ హయంలో కేసీఆర్, మల్లారెడ్డిదే హవా నడిచిందన్నా అని ఎమ్మెల్యే వివేక్ సమాధానం ఇచ్చారు. దీనికి మల్లారెడ్డి.. మేము అధికారం కోల్పోయినం, మాదేం లేదన్న అని మల్లారెడ్డి రిప్లై ఇచ్చారు. దీంతో కాసేపు అసెంబ్లీ లాబీ ప్రాంగణంలో ఇద్దరు నేతలు నవ్వులు పూయించారు.