రూ.వందల కోట్ల విలువైన స్థలాలపై భారీ కుట్ర.. తెరవెనకున్నది వాళ్లేనా?

‘ఫలానా ఏరియాలో ప్లాట్లు కావాలి. ఓన్లీ డాక్యుమెంట్లు ఉన్నా కొంటాం. ఎవరి వద్దనైనా ఉంటే వివరాలు పోస్ట్ చేయండి. నా దగ్గర కొనుక్కునే పార్టీ ఉన్నది’.

Update: 2023-02-13 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: 'ఫలానా ఏరియాలో ప్లాట్లు కావాలి. ఓన్లీ డాక్యుమెంట్లు ఉన్నా కొంటాం. ఎవరి వద్దనైనా ఉంటే వివరాలు పోస్ట్ చేయండి. నా దగ్గర కొనుక్కునే పార్టీ ఉన్నది'. 'విత్ ఓనర్, వితౌట్ ఓనర్.. ఫలానా వెంచర్‌లో బల్క్ ప్లాట్స్ కొంటాం. వితౌట్ ఓనర్ విత్ లింక్ డాక్యుమెంట్స్. బయ్యర్స్ రెడీగా ఉన్నారు. డాక్యుమెంట్స్ వెంటనే పంపండి. ఇతర వివరాలకు నన్ను సంప్రదించండి'. 'రియల్ ఎస్టేట్ మిత్రులారా.. మీ దగ్గర ఏమైనా లిటిగేషన్ రెవెన్యూ డాక్యుమెంట్లు ఉన్నాయా? పెండింగ్ వర్క్స్ ఉంటే మాకు చెప్పండి. మేం క్లియర్ చేయిస్తాం. ఖచ్చితంగా ఓనర్ యాక్సెస్ ఉన్న భూములు ఉంటే చెప్పండి'. ఇవీ కొంతకాలంగా వాట్సాప్ గ్రూపులతోపాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతున్న మెస్సేజీలు. అయితే స్థలం లేకున్నా.. కేవలం డాక్యుమెంట్లతో ఏం చేస్తున్నారన్న సందేహం కలుగుతున్నది. రియల్టర్లు, ఏజెంట్లు ఎవరి కోసం ఈ డాక్యుమెంట్లు కొనుగోలు చేస్తున్నారో అంతుచిక్కడం లేదు. రూ.వందల కోట్ల విలువైన స్థలాలను చేజిక్కించే కుట్ర జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతున్నది.

లిటిగేషన్ భూములైనా.. డాక్యుమెంట్లయినా..

రియల్ ఎస్టేట్ లో ప్రస్తుతం రివర్స్ మార్కెటింగ్ నడుస్తున్నది. భూములను కొంటామంటూ చాలా మంది ప్రచారం చేస్తున్నారు. హక్కులు పక్కాగా ఉన్న భూములను కొంటామంటే పర్వాలేదు. కానీ వివాదాస్పద భూములున్నా కొనుగోలు చేస్తామంటున్నారు. అలాంటి వాటిని అమ్మేందుకు తమ దగ్గర క్లయింట్లు ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఆఖరికి డాక్యుమెంట్ల (సేల్ డీడ్స్)ను కూడా కొంటామంటున్నారు. అంటే స్థలాలు లేకపోయినా పర్వాలేదు.. డాక్యుమెంట్లు ఉంటే చాలు.. ఆఖరికి ఆ యజమాని లేకపోయినా ఏం కాదు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొస్తే సరిపోతుందంటున్నారు. 'స్థలాలు ఎక్కడున్నాయో మీకు తెలియదా? అంటే ఎన్నాండ్లయినా ఆ స్థలం మీకు దక్కదు. అంతకో, ఇంతకో మాకిచ్చేయండి' అంటూ మధ్యవర్తులు మార్కెటింగ్ చేస్తున్నారు. కొందరేమో ఏరియా పేర్లతో ప్రచారం చేస్తున్నారు. ఫలానా ప్రాంతం, ఆ వెంచర్లలో మీకు ప్లాట్లు ఉన్నాయా? అందులోని సేల్ డీడ్స్(డాక్యుమెంట్స్) అమ్మేస్తే కొనేందుకు మా దగ్గర పార్టీ ఉంది. త్వరపడండి.. అంటూ ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. అయితే ఫోన్ చేసి ఆ పార్టీ ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే మాత్రం పేర్లు చెప్పడం లేదు. 'అదంతా మీకనవసరం. డాక్యుమెంట్లు తీసుకురండి.. మేం మాట్లాడుతాం' అంటున్నారు. ఇంతకీ ఉత్త డాక్యుమెంట్లతో ఏం చేస్తారు? దీని వెనుక ఆంతర్యమేమిటో అంతుచిక్కడం లేదు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ గ్రూపుల్లో ఈ మేరకు వారికి కావాల్సిన ఏరియాలు, లే అవుట్లు, సర్వే నంబర్లతో వివరాలు అడుగుతుండడం గమనార్హం. ఆ స్థలాలను పరిశీలిస్తే హైదరాబాద్ నగర శివార్లలోనే ఉన్నాయి. పైగా అత్యంత ఖరీదైన స్థలాలుగా చూపిస్తున్నాయి.

వివాదాస్పద స్థలాల మార్కెటింగ్..

– సిటీలో రూ.130 కోట్ల విలువైన 6 ఎకరాల స్థలం ఉన్నది. ఆన్ లైన్ లో అప్ డేట్ చేయించుకుంటే సరిపోతుంది. ఎలాంటి కేసులు లేవు.

– హైటెక్ సిటీ దగ్గర ఎకరం రూ.50 కోట్లకు పైగా పలికే 20 ఎకరాల భూమి ఉన్నది. ఎకరం రూ.20 కోట్లకే వస్తుంది. హైకోర్టులో కేసు నడుస్తున్నది.

– ఓ మంత్రి ఫామ్ హౌజ్ కి దగ్గరలోనే 20 ఎకరాలు ఉన్నది. నాలుగైదు కేసులు ఉన్నాయి. రూ.10 కోట్లకు ఎకరం.

– ఉప్పల్ లో ఎకరం స్థలం. వేరే వాళ్ల కబ్జాలో ఉన్నది. రూ.30 కోట్లకు ఇచ్చేస్తారు.

– శంషాబాద్ కి దగ్గరలోనే 150 ఎకరాల స్థలం. కొన్ని కేసులు నడుస్తున్నాయి. మొత్తం రూ.200 కోట్లకు ఇచ్చేస్తారు.

ఇలా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లోని వివాదాస్పద భూములను కూడా మార్కెటింగ్ చేస్తున్నారు.

ఎవరి కోసం..

స్థలమున్నా.. డాక్యుమెంట్స్ ఉండాలి. అన్ని పత్రాలున్నా పొసెషన్ సరిగ్గా ఉండాలి. ఈ రెండింట్లో ఏ తేడా వచ్చినా భూమి/స్థలం హక్కులు కష్టమే. తిరిగి అమ్ముకోవాలంటే చుక్కలు కనిపిస్తాయి. మరి ఈ బ్యాచ్ రియల్టర్లు, ఏజెంట్లు ఎవరి కోసం డాక్యుమెంట్స్ కొనుగోలు చేస్తామంటున్నారో అంతుచిక్కడం లేదు. 'సేల్ డీడ్.. వితౌట్ ఓనర్. ఓన్లీ డాక్యుమెంట్స్ ఫర్ సేల్. డాక్యుమెంట్స్ బై పర్సన్ అంటూ పేర్లు, ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. మమ్మల్ని సంప్రదించండంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారు. కోర్టు కేసులు తామే చూసుకుంటామని హామీ ఇస్తున్నారు.

సెటిల్మెంట్ దందా

స్థలాల్లేని సేల్ డీడ్స్ అంటే చిత్తు కాగితాలతో సమానమన్న అభిప్రాయం ఉన్నది. అలాంటి వాటిని రూ.లక్షలు పోసి కొనడానికి సిద్ధమవుతున్న ఆ పెద్దలెవరు? వాటితో ఏం చేయనున్నారు? ఈ వివాదాస్పద భూములను రూ.కోట్లు పోసి ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? వీటన్నింటికీ సమాధానం.. సెటిల్మెంట్ దందాగా తెలుస్తున్నది. ఈ సేల్ డీడ్స్ ముందేసి మొత్తం భూమిని కొట్టేసే ప్లాన్ గా ప్రచారం జరుగుతున్నది. రాజకీయ అండదండలు కలిగిన రియల్టర్లు బడా సంస్థలను నెలకొల్పారు. రూ.వందల కోట్ల లావాదేవీలతో ఖరీదైన భూములనే హస్తగతం చేసుకుంటున్నారు. అయితే వీరికి కొందరు రెవెన్యూ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అంత డబ్బెక్కడిది?

హైదరాబాద్ కు వంద కి.మీ. పరిధిలో వందలాది ఎకరాల్లో భారీ దందా నడుస్తున్నది. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు వందలకోట్లు వెదజల్లాయి. ఎకరం రూ.50 లక్షలకు పైగానే పలికే స్థలాలపై ఆధిపత్యాన్ని దక్కించుకున్నాయి. చిన్నాచితకా డెవలపర్స్ కి ల్యాండ్స్ లేకుండా చేశాయి. ఈ కంపెనీల వెనుక రాజకీయ నాయకులే సూత్రధారులనే ప్రచారం జరుగుతున్నది. బినామీలతో సంస్థలను నెలకొల్పి భూ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఒక్కో కంపెనీ రూ.వందల ఎకరాల్లో వెంచర్లు అంటూ ప్రచారం చేస్తున్నది. ఆ స్థాయిలో కొనుగోళ్లకు వెచ్చించిన రూ.కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న సందేహం కలుగుతున్నది. రిజిస్ట్రేషన్ వ్యాల్యూకి, కొనుగోళ్లకు చెల్లించే మొత్తానికి మధ్య కనీసం పదింతల గ్యాప్ ఉన్నదన్న విషయం అందరికీ తెలుసు. ఈ క్రమంలో నల్లధనం వినియోగం ఏ రేంజ్ లో ఉంటుందో లెక్కలు కట్టొచ్చు. ఇంతకీ ఈ డబ్బెక్కడి నుంచి వచ్చింది? ఈ కంపెనీలకు ఎందుకు ఇచ్చారు? అన్న ప్రశ్నలకు దర్యాప్తు చేస్తేనే సమాధానం లభిస్తుంది.

Tags:    

Similar News