నా చేతుల్లో లేదు.. అభ్యర్థుల ప్రకటనపై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేయగా.. టీ కాంగ్రెస్ మాత్రం ఇంకా వెనుకబడిపోయింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. అభ్యర్థుల ఎంపికపై భేటీలు నిర్వహిస్తూనే ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో టీ కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. నేతలను బుజ్జగించిన తర్వాత అభ్యర్థుల జాబితా విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. దీంతో అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల జాబితా ప్రకటనపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ సమావేశం క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉంటుందనేది తన చేతుల్లో లేదని వ్యాఖ్యానించారు. సర్వే నివేదికలు, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలిపారు.
తనను ఢిల్లీలో అందుబాటులో ఉండమని చెప్పారని, అందుకే వెళ్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుందని, ఈ భేటీలో అభ్యర్థుల ఖరారుపై చర్చిస్తారని అన్నారు. దాదాపు 90 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోండగా.. కొన్ని నియోజకవర్గాల్లో ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో సందిగ్థత నెలకొంది. ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంపై నేతల బలాబలాలను అంచనా వేస్తోంది.