కేసీఆర్ నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు.

Update: 2023-11-03 06:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలు స్వేచ్చ, సామాజిక న్యాయం, సమానమైన అభివృద్ధి కోరుకున్నారని, కానీ అభివృద్ధి ఒక వ్యక్తి ఉక్కుపాదం కింద నలిగిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. సమైక్య పాలనలో సీమాంధ్ర నేతలే పెత్తనం చెలాయించారని, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు.

అయితే బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధిగా తన వంతు పాత్ర పోషించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆనాడు స్వరాష్ట్రం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ నష్ట్రం చేకూర్చే విషయమే.. కానీ ఈ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం ఉన్నదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ గుర్తించి స్వరాష్ట్రం ఇచ్చారని వెల్లడించారు. ఏపీలో కనీసం కాంగ్రెస్‌కు వార్డు నెంబర్ కూడా మిగలడని తెలిసి కూడా ధర్మం వైపు నిలబడాలని, ప్రజాస్వామ్యంలో హక్కులను కాపాడాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని తెలిపారు.

లెక్కలేసుకుంటేనో కేసీఆర్ లాంటి వారు దీక్ష చేస్తేనో.. వంద మంది కేసీఆర్‌లు పుట్టిన వెయ్యి సంవత్సరాలైన తెలంగాణ రాష్ట్రం రాకపోతుండే అని తెలిపారు. నా కుటుంబం.. నాకు కావాల్సిన వ్యక్తి ప్రాణం విలువ ఎంతో.. కేసీఆర్ ప్రాణం విలువకూడా అంతే అన్నారు. ఉద్యమంలో ఎంతో మంది అమరులు అయ్యారని, కేసీఆర్ ప్రాణం అతని కుటుంబానికి ఎలాగో.. అమరుల ప్రాణాలు కూడా వారి కుటుంబాలకు అంతే విలువైనవని చెప్పారు. ఇవాళ ఈ ప్రాణాలను లెక్కపెట్టుకోని ఉంటే కేసీఆర్ పోతే 1201 అవుతుండే అని, కేసీఆర్ పోతే వచ్చే నష్టం ఏముంటుండే.. కాబట్టి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు.

ఉద్యమ కాలంలో ‘టీజీ’ అని కోట్లాడితే.. కేసీఆర్ వచ్చి ‘టీఎస్’ అని చేసుకున్నాడని మండిపడ్డారు. టీఆర్ఎస్‌ను పోలే విధంగా ఉండడం కోసమే ఆర్‌ను సైలెంట్ చేసి.. టీఎస్ చేసుకున్నాడని ఆరోపించారు. రాష్ట్ర అధికార ముద్ర రాచరిక పోకడలతో ఉన్నదన్నారు. త్యాగాలను గుర్తు చేసేలా ఉండాల్సిన చిహ్నం రాచరికాన్ని తెలుస్తోందన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో రాచరిక పోకడ కొనసాగుతోందని, తెలంగాణలో ప్రజాస్వామ్యం లోపించిందని విమర్శించారు. ప్రజల హక్కులను కేసీఆర్ కాల రాశారన్నారు.

కేసీఆర్ నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్ అని ధ్వజమెత్తారు. మార్పు జరగకుండానే ఉద్యమకారుల జీవితాలు తారుమారయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాపాల పుట్ట పగిలిందని, మేడిగడ్డ కుంగిందన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని ఈ పదేళ్లలో నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ తాను చేసింది చెప్పుకోలేక కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ దశాబ్ద పాలన- బీఆర్ఎస్ దశాబ్ద పాలనపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. మా పార్టీ నుంచి నేను, సీఎల్పీ భట్టి వస్తాం.. మిగతా పార్టీల నుంచి ఇద్దరు చొప్పున రండి.. అంటూ సవాల్ విసిరారు. చర్చ పెడితే పాలకు పాలు, నీళ్లకు నీళ్లు బయట పడతాయన్నారు. కమ్యూనిస్టులతో పొత్తుల అంశం ఇంకా ముగియలేదన్నారు. పొత్తు అంశంపై మా సమన్వయ కమిటీ చర్చలు జరుపుతోందన్నారు.


Tags:    

Similar News