కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ఖమ్మం జిల్లా లచ్చ తండాలో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు.
దిశ, కామేపల్లి : విద్యుత్ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయని రేవంత్ రెడ్డి కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మం జిల్లా లచ్చ తండాలో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి యాత్రలో పాల్గొనలేక పోతున్నారన్నారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఆయన సోదరుడు ఇల్లందులో కాంగ్రెస్‌ను గెలిపించారని గుర్తు చేశారు. ప్రజలు కేసీఆర్‌కు ఇచ్చిన అవకాశం ముగిసిందన్నారు. పది బడ్జెట్లలో రూ.23 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని ఆ లెక్కన ఒక్కో నియోజకవర్గానికి రూ.20వేల కోట్లు ఖర్చు చేయాలి కదా అన్నారు.
మరి ఇల్లందు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలన్నారు. రూ.5వేల కోట్లు ఫీజు రీయబర్స్మెంట్ బకాయిలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీలో రూ.800 కోట్ల బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. 2003కు ముందు విద్యుత్ కోతలు ఉన్నట్లే.. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయన్నారు. ఆనాడు ఎదుర్కొన్నట్లుగానే ఈనాడు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్నామన్నారు. ఆనాడు బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమంతో ప్రభుత్వం కుప్పకూలిందని.. సాధ్యం కాదన్న ఉచిత విద్యుత్‌ను కాంగ్రెస్ అమలు చేసి చూపిందన్నారు. రైతులకు అనుకూలమైన విధానాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందని తెలిపారు.
రైతులకు 24 గంటల విద్యుత్‌పై కేసీఆర్ ఆడంబరపు ప్రకటనలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రయివేటు విద్యుత్ సంస్థల్లో 50శాతం కమీషన్లు దండుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ.20వేల కోట్ల బకాయి పడిందని తెలిపారు. ట్రాన్స్ కో, జెన్ కో కలిపి రూ.60వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయాయని.. కేసీఆర్ ధన దాహంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ కొనుగోళ్ళల్లో వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు.
ఏపీ మిగులు విద్యుత్ తక్కువ ధరకే సరఫరా చేస్తామన్నా కేసీఆర్ సుముఖత చూపలేదన్నారు. కమీషన్లు, కాసుల కక్కుర్తి కోసమే తన నమ్మిన బంట్ల వద్ద విద్యుత్ కొనుగోలు చేశారని ఆరోపించారు. ఛత్తీస్ ఘడ్ విద్యుత్ ఒప్పందంలో లోపభూయిష్టం ఉందని గతంలో ఉద్యోగి రఘు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీన్ని ఒప్పుకోని అధికారిని కేసీఆర్ బదిలీ చేశారన్నారు. గుజరాత్ కంపెనీతో వెయ్యి కోట్లు లంచం తీసుకుని కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని కొన్నారని మండిపడ్డారు. దాదాపు రూ.10వేల కోట్లు అప్పు భారం జెన్ కో, ట్రాన్స్ కో మీద పెట్టారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ టెండర్ లేకుండా బీహెచ్ఈఎల్కు అప్పగించారన్నారు. సివిల్ వర్క్‌ను సొంత కాంట్రాక్టర్లకు ఇప్పించి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్లయినా యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి చేయలేదన్నారు. రూ.10వేల కోట్లు భద్రాద్రి కోసం.. రూ.35వేల కోట్లు యాదాద్రి కోసం అప్పు తెచ్చారన్నారు. స్థాయి అనుభవం లేని అధికారులకు బాధ్యతలు అప్పగించారని విరుచుకుపడ్డారు. చిన్న ఉద్యోగాలు చేసి, రిటైర్ అయిన ప్రభాకర్ రావును జెన్కోకు సీఎండీగా నియమించడమేంటన్నారు.
దోపీడికి సహకరించిన ప్రభాకర్ రావుకు, రఘుమా రెడ్డికి ఉన్నతమైన బాధ్యతలు అప్పగించారని మండిపడ్డారు. కేసీఆర్ దోపిడీ వల్లే విద్యుత్ సంస్థలు కుప్పకూలిపోయాయని ఆరోపించారు. రైతులు తీవ్ర విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్నారని తెలిపారు. 2014 నుంచి జరిగిన విద్యుత్ కొనుగొళ్లపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ప్రజలు ఎవరూ ఏసీడీ చార్జీలు కట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ వైఖరిపై నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏసీడీ చార్జీలు రద్దు చేస్తుందన్నారు. రైతు సంఘాలు, రైతులు అందరం రోడ్డెక్కుదామని.. బషీర్ బాగ్ ఉద్యమం లాంటి మరో ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మొదటి దశలో రోడ్డెక్కి నిరసన, ఆ తరువాత సబ్ స్టేషన్ల ముట్టడి... ఈఆర్సీ సరైన నిర్ణయం తీసుకోకపోతే విద్యుత్ సౌధను ముట్టడిస్తామన్నారు. ఈ దోపిడీ లబ్ధిదారులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నారు. కమ్యూనిస్టులు దోపీడీదారుల పక్షాన ఉంటారో... ప్రజల పక్షాన కొట్లాడుతారో నిర్ణయించుకోవాలన్నారు. జాతీయ స్థాయిలో కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో కలిసి పనిచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై పోరాటానికి కలిసి రావాలని కోరారు.