రేవంత్ ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, ప్రియాంక హాజరు
కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది. ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలను, పార్టీ పరిశీలకుల నివేదికను పరిగణనలోకి తీసుకున్న ఏఐసీసీ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది. అన్ని స్థాయిల్లోని పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. సీఎల్పీ నేతగా ఎన్నిక కావడంతో ముఖ్యమంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. రాజ్‌భవన్‌లో గురువారం (డిసెంబరు 7న) ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తదితరులందరితో చర్చించిన తర్వాత సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అభిప్రాయాల మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లాంఛనంగా నిర్ణయం తీసుకున్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు.
ఏడవ తేదీన ప్రమాణ స్వీకారం :
సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డి పేరును హైకమాండ్ ప్రకటించడంతో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఖరారైనా డిప్యూటీ సీఎంల విషయంలో ఇంకా పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత వెల్లడిస్తామని పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కతో పాటు సీతక్క తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా పార్టీ నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉన్నది. ఈ నెల 7వ తేదీన ఉదయం 10.28 గంటలకు రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నది. సీఎంగా రేవంత్‌తో పాటు మొత్తం (17 మంది) మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేస్తుందా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉన్నది.
నేడో రేపో క్యాబినెట్ కూర్పుపై క్లారిటీ :
సీఎంగా రేవంత్ ఎంపిక ఖరారైనప్పటికీ మంత్రివర్గంలో ఎవరెవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. జిల్లాలు, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఏఐసీసీ నిర్ణయించనున్నది. ప్రతీ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీ రాష్ట్ర యూనిట్ భావిస్తున్నందున ఇప్పటికే కొన్ని పేర్లు గాంధీభవన్‌లో చర్చల్లో నలుగుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో చర్చించిన తర్వాత క్యాబినెట్ కూర్పు, పోర్టుఫోలియోలపై స్పష్టత రానున్నది. సీఎంతో పాటు మరో 17 మంత్రులకు అవకాశం ఉన్నందున ఒకరిద్దరు ఎమ్మెల్సీ కోటా నుంచి ఉండొచ్చని సమాచారం.
నేడు సోనియా, రాహుల్‌తో భేటీ :
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ నుంచి ప్రకటన వెలువడే సమయానికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఎమ్మెల్యేలతో చర్చిస్తూ ఉన్న రేవంత్‌రెడ్డి వెంటనే ఇంటికి బయలుదేరి అక్కడి నుంచి బేగంపేట చేరుకుని స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్ళారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ తదితరులతో బుధవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. రాజ్‌భవన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా వ్యక్తిగతంగా వారిని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించనున్నారు. మరోవైపు మంత్రివర్గ కూర్పు గురించి కూడా ఢిల్లీలో సీనియర్ నేతలతో చర్చించనున్నారు. పరిపాలనకు సంబంధించిన అంశాలపై కూడా వారితో రేవంత్ చర్చించనున్నారు.
తొలగిన ప్రతిష్టంభన :
సీఎల్పీ నేతగా ఎన్నుకోడానికి సోమవారం ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన పార్టీ పరిశీలకులు డీకే శివకుమార్, దీపాదాస్ మున్షీ, కే.మురళీధరన్, కేజే జార్జి, అజయ్ కుమార్ అక్కడ జరిగిన ఏకవాక్య తీర్మానంతో పాటు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల అభిప్రాయాలతో ఏఐసీసీకి నివేదిక సమర్పించారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆ పోస్టు కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క సైతం ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో వారిద్దరూ ఢిల్లీకి వెళ్ళి సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపారు. డీకే శివకుమార్‌తో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తదితరులతో వారి అభిప్రాయాలను పంచుకున్నారు.
రేవంత్‌కే మొగ్గు చూపిన అధిష్టానం :
పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలతో పాటు ఎన్నికల ప్రచారం సమయంలోనే వివిధ స్థాయిల్లోని పార్టీ శ్రేణుల నుంచి వివరాలను సేకరించిన అధిష్టానం చివరకు సీఎల్పీ నేతగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డివైపే మొగ్గు చూపింది. సీనియర్ల మధ్య ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా అందరితో చర్చించి, వారి అసంతృప్తిని కన్విన్స్ చేసి పార్టీ నిర్ణయం తీసుకున్నది. పరిపాలన ‘వన్ మాన్ షో’లాగా ఉండదని, టీమ్ వర్క్ తో సాగుతుందని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పోస్టు కోసం పార్టీ నేతల మధ్య పోటీ ఉన్నప్పటికీ అందరితో మాట్లాడి లోతుగా చర్చించి చివరకు పార్టీ ప్రయోజనాలు, ప్రజలకు పరిపాలనా అవసరాల మేరకు రేవంత్‌రెడ్డినే సీఎల్పీ నేతగా, ముఖ్యమంత్రిగా ఖరారు చేసింది.
రేవంత్‌కు పెరిగిన సెక్యూరిటీ :
సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో ప్రకటన చేయడంతోనే హైదరాబాద్ హోటల్‌లో ఉన్న ఆయనకు తెలంగాణ పోలీసు శాఖ సెక్యూరిటీ పెంచింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు నాలుగు ఎస్కార్ట్ వాహనాలను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిద్ధం చేసింది. రేర్ గార్డ్స్, ఫ్రంట్ గార్డ్స్ తో పాటు డాగ్ స్క్వాడ్, అంబులెన్స్, జామర్ తదితర వాహనాలన్నీ కాన్వాయ్‌లో ఉండేలా ప్లానింగ్ ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ స్థానంలో 8 ప్లస్ 2 (సాయుధ) పద్ధతిలో మూడు షిప్టుల్లో 24 గంటల భద్రత కొనసాగేలా (మొత్తం 30 మంది) ఇంటెలిజెన్స్ వింగ్ సిద్ధం చేస్తున్నది.
సిటీ పోలీసు కమిషనర్‌తో పాటు వివిధ విభాగాల పోలీసు అధికారులకు ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రికి కల్పించిన భద్రతను వెంటనే అమల్లోకి తెచ్చేలా ఆయన స్పష్టం చేశారు. రేవంత్ నివాసానికి కూడా మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటైంది. ఎవరి వాహనం వచ్చినా పోలీసులు క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రికి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించడం ఆనవాయితీ కావడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా అలర్టయ్యారు. తక్షణం నివాసానికి డీఎస్పీ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాటైనందున కుటుంబ సభ్యులతో సంప్రదించడానికి కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా సిద్ధమవుతున్నది.
ఢిల్లీలోనూ స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాట్లు :
ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పార్లమెంటు సెక్రటేరియట్ సమకూర్చిన ఎంఎస్ ఫ్లాట్స్ లోని యమునా బ్లాక్‌లోని ఆయన నివాసానికి అదనపు భద్రత ఏర్పాటైంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ఉండే భవన్‌లో సీఎం హోదాలో మకాం ఉండేవారికి కేటాయించే శబరి బ్లాక్ దగ్గర కూడా హై సెక్యూరిటీ ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఢిల్లీలో విమానాశ్రయంలో దిగింది మొదలు తిరిగి హైదరాబాద్ చేరుకునేంత వరకు సీఎంకు కల్పించే భద్రతే కొనసాగనున్నది. ఇప్పటికే ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులకు హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ జీఏడీ విభాగం నుంచి ఆదేశాలు వెళ్ళాయి.