KTR : రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం కోసమే కేసులు పెడుతున్నాడు : కేటీఆర్

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మీడియా సమావేశం నిర్వహించారు.

Update: 2024-11-07 11:17 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో నిర్వహించిన ఫార్ములా-1 రేసింగ్(Formula E-Car Racing) లో అవకతవకలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 'ఈ-రేస్ అనేది ప్రపంచంలోని అత్యంత గొప్ప నగరాల్లో జరుగుతోంది. అలాంటి నగరాల చెంతకు హైదరాబాద్(Hyderabad) ను చేర్చాలని మేము ప్రయత్నం చేసాం. ఈ - రేస్ తెచ్చేందుకు చేసే ప్రయత్నంలో సియోల్, జోహెన్నస్ బర్గ్ ను తలదన్ని మన హైదరాబాద్ కు ఈ - రేస్ ను తెచ్చాము. దీనిని మేము ఒక రేసింగ్ గా మాత్రమే చూడలేదు. ఎలక్ట్రిక్ కార్లను ప్రమోట్ చేసి, ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు మన హైదరాబాద్ ను అడ్డాగా మార్చాలని మేము ఈ-రేస్ ను ఒక అడుగుగా ప్రయత్నం చేశాం. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకు మన హైదరాబాద్ ను ఎలక్ట్రిక్ మ్యానుఫాక్చరింగ్ హబ్ గా మార్చే ప్రయత్నం చేసాం. ఫార్ములా E-రేస్ కోసం పెట్టిన మొత్తం ఖర్చు రూ.150 కోట్లు.. దాని వల్ల హైదరాబాద్‌కు వచ్చిన లాభం రూ.700 కోట్లు వచ్చింది. ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందో నాకు అర్థం కావడం లేదు' అని కేటీఆర్ అన్నారు. 

'హెచ్‌ఎండీఏ(HMDA)కు తెలియకుండా జరిగిందని మాట్లాడుతున్నారు కానీ నవంబర్ 14 న GO కూడా ఇచ్చారు. హెచ్‌ఎండీఏ ఇండిపెండెంట్ బోర్డు. ఇందులో నిర్ణయాలు తీసుకోవాలంటే క్యాబినెట్ భేటీలో ఆమోదం తెలపాల్సిన అవసరం లేదు. హెచ్‌ఎండీఏ చైర్మన్ సీఎం, వైస్ చైర్మన్ మున్సిపల్ మినిస్టర్, ఏండీగా మెట్రోపాలిటన్ కమిషనర్ ఉంటారు. ఎన్నికల ముందు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కావద్దని ఫార్ములా ఈకి ఫండ్స్ రిలీజ్ చేయమని హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ కు నేనే చెప్పాను. అవేమీ నాకోసం ఖర్చు పెట్టడానికి కాదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయస్థాయిలో నిలపడానికి చేశాను. ఇందులో అవినీతి జరిగిందని, కేటీఆర్ మీద కేసు పెడతామని అంటున్నారు. నా మీద ఎందుకు కేస్ పెడతారు? హైదరాబాద్ ను అంతర్జాతీయంగా పేరు తెచ్చినందుకు పెడతావా? లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకా? బెంగళూరు కన్నా ఐటీ ఎగుమతులను పెంచినందుకా? ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించినందుకా? ముందు సుంకిశాలలో గోడ కూలిపోయి 80 కోట్ల నష్టానికి కారణమైన మేఘ ఇంజనీరింగ్ మీద కేసు పెట్టు. రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడేది లేదు. కేసులు వేస్తే భయపడేది ఏం లేదు. జైల్లో పెట్టి పైశాచికానందం పొందుతా అంటే జైలుకు పోతా. జైల్లో యోగా చేసి బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తా. అంతేగానీ దేనికీ భయపడేది లేదు. అసలు ఈ వ్యవహారంలో అవినీతి జరిగితేనే కదా నిరూపించడానికి.. కేవలం నన్ను జైలుకి పంపి పైశాచిక ఆనందం పొందుతా అంటే.. జైలుకు వెళ్ళడానికి సిద్ధం..' అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News