కేసీఆర్ పై వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి
ఎంపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో:ఎంపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇటీలే తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో మిగిలేది కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది. అయితే అంతకు ముందే పలువురు సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టగా తాజాగా వ్యూహం మార్చి సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తోందా అనే చర్చ తెరమీదకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఇది వరకే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ అయ్యారు. అయితే తాజాగా శుక్రవారం ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం వద్దకు వెళ్లి కలవడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు వెళ్లిన ఆయన త్వరలో తిరిగి మాతృ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.
మిగతా ఎమ్మెల్యేలకంటే భిన్నంగా..:
శుక్రవారం మాజీ మంత్రి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎంను కలిసిన సమయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ తదితరులు ఉన్నారు. వీరందరితో దానం కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే మిగతా ఎమ్మెల్యేలు సీఎం వద్దకు సోలోగా వెళ్లగా దానం నాగేందర్ మాత్రం దీపాదాస్ మున్సీ, భట్టి, విక్రమార్క వంటి సీనియర్లతో పాటు రేవంత్ రెడ్డిని కలవడంతో ఆయన పార్టీ మారడం దాదాపు ఖాయం అనే చర్చ జరుగుతోంది.