తెలంగాణకు రేవంత్ కాలకేయుడిలా మారారు: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
రేవంత్ తెలంగాణకు కాలకేయుడిలా మారారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్ తెలంగాణకు కాలకేయుడిలా మారారని ఎమ్మె్ల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ ఏడాదిలో రేవంత్ రెడ్డి చేసిందేమి లేకపోవడంతో తిట్లు అందుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె.వాసుదేవ రెడ్డితో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రం మొత్తం ప్లానింగ్, నిర్మాణం కంప్లీట్ కేసీఆర్ ప్రభుత్వ పాలనలోనే జరిగిందన్నారు. కేవలం రంగులు వేసి తాను కాళోజీ క్షేత్రాన్ని ప్రారంభించానని రేవంత్ చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ద్రోహి రేవంత్ కళాక్షేత్రం ప్రారంభించినందుకు కాళోజీ ఆత్మ క్షోభించి ఉంటుందన్నారు. వరంగల్‌లో మహిళల సమావేశం పెట్టి కేసీఆర్‌ను తిట్టేందుకే రేవంత్‌రెడ్డి ప్రాధాన్యతనిచ్చారని ఆరోపించారు.
విద్యార్థులు, మహిళలు రేవంత్ భాషను చూసి అసహ్యించుకుంటున్నారన్నారు. రేవంత్ రాజకీయ ప్రస్థానం టీఆర్ఎస్‌లో మొదలైందని తెలిపారు. తన అవసరాన్ని బట్టి నేతలను పొగడటం తిట్టడం రేవంత్‌కు అలవాటుగా మారిందన్నారు. సోనియాను బలిదేవత అన్నది రేవంత్ కాదా..? కేసీఆర్ పోరాడితేనే తెలంగాణ వచ్చింది అన్నది రేవంత్ కాదా.. అని ప్రశ్నించారు. కేసీఆర్ మొక్క కాదు చిదిమేయడానికి, ఆయన మహా వృక్షమని, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. బాహుబలి కేసీఆర్ చేతిలో రేవంత్ రాజకీయ జీవితం పరిసమాప్తం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‌లో జరిగింది విజయోత్సవ సభ కాదు.. సీఎం రేవంత్ బూతుల సభ అన్నారు. ఏం సాధించారని రేవంత్ విజయోత్సవాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని చూసి కేసీఆర్ నేర్చుకోవాలా.. రాహుల్ ఇంకా 30 సంవత్సరాలైనా పీఎం కాలేడని.. ఆయనను చూసి కేసీఆర్ ఏం నేర్చుకోవాలని నిలదీశారు.