ఈసీ నిర్ణయంపై స్పందించిన హరీష్ రావు.. డబ్బులు వేసి తీరతామని ధీమా
ఎన్నికల వేళ రైతు బంధు పంపిణీకి ఈసీ బ్రేక్ వేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ రైతు బంధు పంపిణీకి ఈసీ బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. రైతుబంధు నిలిపివేయడానికి హరీష్ రావు ప్రసంగమే కారణమని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదే అంశమై మంత్రి హరీష్ రావు జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారం సభలో స్పందించారు. రైతుబంధుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని చెప్పానని.. అందులో తప్పేం ఉందన్నారు. నోటి దగ్గర ముద్దను కాంగ్రెస్ అడ్డుకుంటోందన్నారు. ఓట్ల కోసం తాము రైతు బంధు తేలేదన్నారు. తెలంగాణ రైతులతో కేసీఆర్ ది పేగు బంధమన్నారు.
ఓట్లు దండుకుని కర్నాటకను కాంగ్రెస్ నేతలు మర్చిపోయారన్నారు. కాంగ్రెస్ నాయకులవన్నీ ఝూటా మాటలన్నారు. రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసిందన్నారు. పెట్టుబడి సాయం రైతులకు ఇవ్వొద్దా? అని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అన్నారని హరీష్ రావు గుర్తు చేశారు. రైతులకు బిచ్చం వేస్తున్నారని రేవంత్ అంటున్నారని మండి పడ్డారు. రైతుబంధును ఎన్ని రోజులు ఆపుతారో చూస్తామన్నారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని 3వ తేదీ తర్వాత రైతుబంధు డబ్బులు అకౌంట్ లో పడతాయన్నారు. ఈ సారి రైతుబంధును రూ.16 వేలు చేస్తామన్నారు. రైతుబంధును ఆపిన కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీని రైతులు తరిమికొట్టాలన్నారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ అవుతుందన్నారు. రైతుబంధు రావాలంటే కాంగ్రెస్ ఖతం కావాలన్నారు.