పండగకు పల్లెబాట పట్టిన పట్నంవాసులు.. కిటకిటలాడుతున్న రైళ్లు, బస్సులు

దసరా(Dasara) సెలవుల నేపథ్యంలో పట్నంవాసులు పల్లెబాట పట్టారు.

Update: 2024-10-07 11:39 GMT

దిశ, వెబ్ డెస్క్ : దసరా(Dasara) సెలవుల నేపథ్యంలో పట్నంవాసులు పల్లెబాట పట్టారు. దీంతో గత మూడురోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ లోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లుతోపాటు... మహాత్మా గాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసి పోయాయి. చాలినన్ని రైళ్లు, బస్సులు లేక.. ఉన్నవాటిలో రిజర్వేషన్ దొరక్క ఊళ్ళకు వెళ్ళేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చిన్నపిల్లలు, వృద్దులు, వికలాంగులు కష్టాలు పడ్డారు. కనీసం కూర్చోడానికి స్థలం లేక గంటల తరబడి నిలబడి ప్రయాణం చేశారు. ఇక దసరా సెలవుతోపాటు విజయవాడ దుర్గా శరన్నవరాత్రులు కూడా జరుగుతున్న నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ప్రయాణికులతో, భవాని మాలధారులతో నిండిపోయింది. ఇప్పటికైనా రైల్వే అధికారులు, ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు స్పందించి తగినన్ని ట్రైన్లు, బస్సులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రైవేట్ ట్రావెల్స్ అమాంతం టికెట్ల రేట్లు పెంచి, ప్రయాణికుల నుండి భారీగా డబ్బులు దండుకుంటున్నాయి.  


Similar News