తెలంగాణ విద్యుత్ సంస్థలో ప్రక్షాళన షురూ.. 11 మంది డైరెక్టర్లు తొలగింపు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో విద్యుత్ సంస్థల డైరెక్టర్ల తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో విద్యుత్ సంస్థల డైరెక్టర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమంగా నియామకం పొందిన మొత్తం 11 మందిపై వేటు వేశారు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లను తొలగిస్తూ సోమవారం సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. వెంటనే కొత్త డైరెక్టర్ల నియామకాలకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత శాఖను ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిరాగానే ముందుగా విద్యుత్ సంస్థపైనే దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. అసెంబ్లీ వేదికగా విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాలపై 30 పేజీలతో శ్వేతపత్రం సైతం విడుదల చేశారు. దీనిపై రెండ్రోజులు అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడి చర్చలు జరిగాయి. తాజాగా.. సంస్థలో ప్రక్షాళన ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో కీలక పాత్ర పోషిస్తున్న డైరెక్టర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.