పెట్టుబడిదారుల ఆర్థిక ప్రయోజనాలకే మత విద్వేషాలు : ప్రొఫెసర్ హరగోపాల్

పెట్టుబడిదారుల ఆర్థిక ప్రయోజనాల కొరకే కేంద్ర పాలకులు దేశంలో మత విద్వేషాలను రెచ్చకొడుతున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్మించారు.

Update: 2022-12-26 14:19 GMT

దిశ,మహబూబ్ నగర్: పెట్టుబడిదారుల ఆర్థిక ప్రయోజనాల కొరకే కేంద్ర పాలకులు దేశంలో మత విద్వేషాలను రెచ్చకొడుతున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. సోమవారం పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో జరిగిన రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర పాలకులు మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల అసంతృప్తిని తమ వైపు మళ్లకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని, భారతదేశపు బడ్జెట్ కంటే ఎక్కువగా 100 మల్టీనేషన్ కంపెనీల ఆదాయం ఉందని ఆయన గుర్తు చేశారు. ఆకలి చావులో పేదరికం, నిరుద్యోగం తాండవిస్తుందని, ఈ అసంతృప్తి నుండి ప్రజల దృష్టిని మరల్చడం కోసం హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాన్ని పెంచడం లాంటి చర్యలకు పూనుకుంటున్నారని ఆయన విమర్శించారు.

భారతదేశపు ముడి సర్కుల్ని సకల సంపదలను దోచుకోనడం కోసం బ్రిటిష్ పాలకులు ఏ విధానాలు అవలంబించారో, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అదేవిధంగా అవలంబిస్తుందని విమర్శించారు. బ్రిటిష్ వారి ప్రోద్బలంతో సావర్కర్, మహ్మద్ అలీ, జిన్నా దేశంలో దిజాతి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్, ముస్లిం లీగ్ భావాజాలం ఈ దేశంలో లక్షలాదిమందిని నిరాశ్రయులను చేసిందని, లక్షలాది ప్రాణాలను బలి తీసుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేకమంది ముస్లిం పాలకులు మతసామరస్యం కొరకు పని చేశారని దేవాలయాలను నిర్మించారని అటువంటి వాళ్ళలో అక్బర్ చక్రవర్తి, టిప్పు సుల్తాన్ ఆదర్శంగా నిలిచారని వారు తెలిపారు. టిప్పు సుల్తాన్ తండ్రి హైదరాలి దేవాలయ ధర్మకర్తగా కూడా వ్యవహరించారని ఆయన తెలిపారు. టిఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ నాయకులు నర్సింహారెడ్డి, ఎంఆర్జేఏసీ కన్వీనర్ అనీఫ్ అహ్మద్, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎం. రాఘవచారి, సిఐటియూ ప్రధాన కార్యదర్శి కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News