'రెగ్యులరైజ్‌ కాని కాంట్రాక్ట్‌ లెక్చరర్లను క్రమబద్ధీకరించండి'.. ముఖ్యమంత్రికి తమ్మినేని లేఖ

Update: 2023-05-29 16:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో రెగ్యులరైజ్‌ కాని కాంట్రాక్ట్‌ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న జనరల్‌, ఒకేషనల్‌ కాంట్రాక్ట్‌ లెక్చరర్లు, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్లను కొంతమందిని రెగ్యులరైజ్‌ చేశారని తెలిపారు. కొన్ని కారణాల వలన ఇంకా కొద్దిమంది క్రమబద్దీకరించలేదన్నారు. వారికి కూడా తగిన సడలింపులివ్వాలని కోరారు. సుమారు 417 ఒకేషనల్‌ కాంట్రాక్ట్‌ లెక్చర్లను పరిగణన లోకి తీసుకోలేదని తెలిపారు. డిగ్రీ కళాశాలల్లో సుమారు 823 మంది కాంట్రాక్ట్‌ లెక్చరర్లు గత 20 ఏళ్లుగా పనిచేస్తుండగా కేవలం 270 మంది కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు మాత్రమే రెగ్యులరైజ్‌ చేశారని తెలిపారు.

వివిధ కారణాలతో 553 మంది కాంట్రాక్ట్‌ లెక్చరర్లు క్రమబద్దీకరణ జరగలేదన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో రెగ్యులరైజ్‌ కాకుండా మిగిలిపోయిన సుమారు 417 మంది ఒకేషనల్‌ కాంట్రాక్ట్‌ లెక్చర్లను పోస్టులు మంజూరు చేసి, అర్హతలో సడలింపులిచ్చి క్రమబద్దీకరించాలన్నారు. జనరల్‌ కోర్సుల్లో పనిచేస్తున్న 23 మందికి అవార్డ్‌ ఆఫ్‌ పాస్‌ డివిజన్‌ సమస్య ఉన్నదని తెలిసిందని, అలాగే మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఫీమేల్‌) కలిసి బోధిస్తున్న 15 మంది కాంట్రాక్ట్‌ లెక్చరర్ల విషయంలో 60 శాతం మార్కులు దాటి ఉన్నప్పటికీ ‘అవార్డ్‌ ఆఫ్‌ పాస్‌’ డివిజన్‌ లేదని రెగ్యులరైజ్‌ చేయలేదన్నారు. వీరి విషయంలో మార్కులను పరిగణలోకి తీసుకొని క్రమబద్ధీకరించాలని లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News