Ponguleti:ఆ భూములు రిజిస్ట్రేషన్ చేస్తే సహించేది లేదు.. అధికారులపై మంత్రి సీరియస్
ప్రభుత్వ భూములను బడాబాబులకు రిజిస్ట్రేషన్ చేస్తే సహించేది లేదని, తప్పు చేసిన అధికారులపై చర్యలు ఉంటాయని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ భూములను బడాబాబులకు రిజిస్ట్రేషన్ చేస్తే సహించేది లేదని, తప్పు చేసిన అధికారులపై చర్యలు ఉంటాయని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులతో సమావేశమైన ఆయన శాఖ పనితీరుపై సమీక్ష జరిపారు. ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగులు నిజాయితీ, అంకితభావంతో పని చేయాలని కోరారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. అలాగే అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు మొదలైన వాటికి అవసరమైన బడ్జెట్ అవసరాలను త్వరలో క్లియర్ చేస్తామని ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు.
రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాల ఆవశ్యకతను మంత్రి ప్రస్తావిస్తూ, త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నామని, దీని కింద అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రెండేళ్లలో ప్రభుత్వ భవనాల్లో పనిచేయడం ప్రారంభిస్తాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని రిజిస్ట్రేషన్ శాఖల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసులను మన రాష్ట్రంలో కూడా పాటించేలా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలను అందించేందుకు వీలుగా కొత్త టెక్నాలజీలను అవలంబించాల్సిన అవసరాన్ని కూడా తెలిపారు. ప్రభుత్వ కార్యదర్శి, స్టాంపులు రిజిస్ట్రేషన్ల కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి రిజిస్ట్రేషన్ శాఖ పనితీరు గురించి సంక్షిప్త వివరణ ఇచ్చారు. 2014లో రూ.2,746 కోట్లుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గతేడాది 14,588 కోట్లకు చేరుకుందని, మంత్రిగారి మార్గదర్శకత్వంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీలు సజావుగా పూర్తయ్యాయని తెలిపారు.
రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ వార్షిక నివేదికను కూడా మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా కొందరు అధికారుల పనితీరు బాగాలేదని, అధికారుల పనితీరు మార్చుకోకపోతే ఎంతటి వారిపై అయినా చర్యలు తీసుకోక తప్పదన్నారు. అధికారులు మానవత్వంతో పనిచేయాలని, రెవెన్యూ వ్యవస్థకు మంచి పేరు తీసుకొచ్చేలా పని చేయాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలు పేదవాడికే దక్కాలని, బడాబాబులకు రిజిస్ట్రేషన్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తనకు ఎవరి మీద కోపం లేదని, ప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తుంటానని, అధికారులను తలెత్తుకునేలా చేస్తానని చెప్పారు. ఇక అధికారుల పదోన్నతులు, బదిలీల విషయంలో ఎవరి ప్రమేయం అవసరం లేదని, రాజకీయ నాయకుల పైరవీలతో వచ్చినా వృథా ప్రయాసే అవుతుందని తెలిపారు. అన్ని తానే చూసుకుంటానని, ఎవరైతే శాఖకు మంచి పేరు తీసుకొస్తారో వారిని గుర్తిస్తానని అధికారులకు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.