రాష్ట్రంలో రావణకాష్ఠం.. బీఆర్‌ఎస్ సర్కారుపై రేవంత్ ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలన రావణకాష్టంలా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు.
దిశ, వరంగల్ టౌన్: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలన రావణకాష్టంలా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. అయ్యా కొడుకులు వెయ్యి ఎకరాల్లో చెరో ఫాంహౌస్ నిర్మించుకున్నారని ఆరోపించారు. సర్కారు విధానాలపై ధ్వజమెత్తారు. హాథ్ సే హాథ్ జోడో యాత్ర మంగళవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా వరంగల్ హెడ్ పోస్టాఫీసు సెంటర్‌లో ఏర్పాటు చేసిన స్ట్రీట్‌కార్నర్ మీటింగ్‌లో రేవంత్ ప్రసంగించారు.
గొప్ప చరిత్ర కలిగిన వరంగల్‌కు గులాబీ గ్రహణం పట్టుకుందన్నారు. ప్రపంచానికి మేధావులను అందించిన చరిత్ర కలిగిన కాకతీయ యూనివర్సిటీలో నేడు నియామకాలు లేక, ప్రొఫెసర్లు లేక దీనస్థితికి చేరుకుందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేయూ విద్యార్థుల పాత్ర మరువలేనిదన్నారు. పౌరుషానికి మారుపేరైన వరంగల్ ఖిల్లాలో బిల్లా రంగా లాంటి ఎమ్మెల్యేలు అవసరమా? అంటూ ప్రశ్నించారు. వరంగల్‌లో ఏ ఎమ్మెల్యే అయినా ప్రజలకు అందుబాటులో ఉన్నారా? అంటూ ధ్వజమెత్తారు. వరంగల్‌లో బీఆర్ఎస్ నేతలు భూములు ఆక్రమించుకుని దోచుకుంటున్నారని విమర్శించారు. ఆజాంజాహీ మిల్లు భూములను కార్మికులకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు.
కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప వరంగల్‌లో ఈ తొమ్మిదేళ్లలో ఏ అభివృద్ధి జరగలేదని అన్నారు. వరంగల్ అంటే ప్రేమ అంటున్న కేసీఆర్‌కు ఇక్కడి భూములు ఇక్కడి ఆస్తులపైనే ప్రేమ అని అన్నారు. తొమ్మిదేళ్లలో వెయ్యి ఎకరాల్లో కేసీఆర్ ఫాంహౌస్, కొడుకుకు 500 ఎకరాల ఫాంహౌస్ వచ్చింది తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో ఈ రావణకాష్టానికి పరిష్కారం లేదా? అంటూ ప్రశ్నించారు.
వరంగల్‌కు కొండంత అండగా..
తెలంగాణ తెచ్చిన అన్నోడికి రెండు సార్లు అధికారం ఇచ్చారు.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వరంగల్‌లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కొండా దంపతులను ఆశీర్వదించాలని కోరారు. వారు మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటారని చెప్పారు. వైఎస్ హయాంలో కొండా దంపతులకు ఎలాంటి గౌరవం దక్కిందో.. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం..
ఆనాడు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, ఈనాడు ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు ఇవ్వబోయేది కూడా కాంగ్రెస్ పార్టీయేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ తెలిపారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ఉద్ఘాటించారు. వరంగల్ తూర్పులో సురేఖమ్మ గెలుపు ఖాయమని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించుకుందాం, ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.